శనివారం 24 అక్టోబర్ 2020
National - Sep 27, 2020 , 18:58:49

మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ: పార్లమెంటు ఇటీవల ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం ఆమోదం తెలిపారు. ఒకవైపు రైతులు, మరోవైపు ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలిపినప్పటికీ ఈ బిల్లుల ఆమోదానికే ఆయన మొగ్గు చూపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఉభయ సభలు ఆమోదించిన రైతు ఉత్పత్తి వ్యాపారం మరియు వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు 2020, రైతుల ధర భరోసా (సాధికారత మరియు రక్షణ), వ్యవసాయ సేవల ఒప్పందం బిల్లు 2020, ముఖ్యమైన వస్తువుల (సవరణ) బిల్లు 2020ను ఆమోదిస్తున్నట్లు గెజిట్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ మూడు వ్యవసాయ బిల్లులు ఇక చట్టంగా మారినట్లే.

మరోవైపు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమవుతున్నాయి. పంజాబ్ రైతులు శుక్రవారం బంద్ పాటించగా హర్యానా రైతులు సోమవారం ఆందోళనకు పిలుపునిచ్చారు. కాగా, కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వంలో భాగమైన శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఆ పార్టీకి చెందిన హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo