బుధవారం 03 జూన్ 2020
National - May 14, 2020 , 16:03:32

ప్రథమ పౌరుని పొదుపు బాట

ప్రథమ పౌరుని పొదుపు బాట

న్యూఢిల్లీ: కోట్లాదిమంది భారతీయులు, ముఖ్యంగా వలస కార్మికులు, నిరుపేదలు, రోజుకూలీలు పిడికెడు ముద్ద కోసం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రథమపౌరుడు పొదుపు చర్యలు చేపట్టారు. అధికారిక కార్యక్రమాల్లో ఆడంబరాల ముద్ర చెరిపేస్తున్నారు. ఈసరికే సంవత్సర జీతంలో 30 శాతం కోత విధించుకున్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కరోనా కల్లోలం నేపథ్యంలో పలు పొదుపు చర్యలు చేపట్టారని అధికారులు తెలిపారు. వచ్చే రిపబ్లిక్ దినోత్సవం కోసం పదికోట్ల రూపాయలతో కొనుగోలు చేయనున్న లిమజిన్ కారు అక్కరలేదని చెప్పారు. ప్రస్తుతం వాడుతున్న మర్సిడెజ్ బెంజ్ ఎస్ క్లాస్ (ఎస్600) నే వాడుకోవాలని నిశ్చయించుకున్నారు. అ్తాయదునిక హంగూ ఆర్భాటాలతో ఉండే లిమజిన్ కొనుగోలును అటకెక్కించారు. అలాగే ఇకనుంచి రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చే విందుల్లో విలాసవంతమైనవిగా కనిపించే అంశాలను తగ్గించేస్తారు. అతిథుల సంఖ్య తగ్గుతుంది. వంటకాలూ తగ్గిస్తారు. అధికారిక పర్యటనలపై వచ్చేవారికి మర్ఆదలకు ఏం లోటు రానీయరు. కానీ ఆడంబరం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కనీసం 20 శాతం సొమ్ము ఆదా చేసి పేదజల కోసం ఖర్చు చేయాలనేది దీని వెనుకగల ఆలోచన.  రాష్ట్రపతి భవన్ విశాలమైన ఆవరణలో పూల అలంకరణలు కూడా తగ్గిస్తారు. ఏడాది కాలం వరకు ఎలాంటి కొత్త నిర్మాణాలు ఈ ఆవరణలో చేపట్టరు. పొదుపు చర్యల పేరిట కాంట్రాక్టు పనివారికి వేతనాలు తగ్గించడం ఉండదని, అనవసర వ్యయానికి మాత్రమే కోత ఉంటుందని అధికారులు వివరించారు.


logo