శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Feb 24, 2020 , 01:05:48

న్యాయవ్యవస్థతో లింగ సమానత్వం

న్యాయవ్యవస్థతో లింగ సమానత్వం
  • అభ్యుదయ సామాజిక పరివర్తనకు సుప్రీంకోర్టు బాటలు
  • సాంకేతికతతో న్యాయవ్యవస్థకు సరికొత్త సవాళ్లు
  • అంతర్జాతీయ న్యాయ సదస్సులో రాష్ట్రపతి కోవింద్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: లింగపరమైన న్యాయా న్ని సాధించడంలో సుప్రీంకోర్టు చేసిన అవిరళ కృషిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొనియాడారు. సుప్రీంకోర్టు నిరంతరం క్రియాశీలకంగా, ప్రగతిశీలకంగా వ్యవహరిస్తున్నదని ప్రశంసించారు. ‘న్యాయవ్యవస్థ- మారుతున్న ప్రపంచం’ అన్న అంశంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న అంతర్జాతీయ న్యాయ సదస్సులో రెండో రోజు ఆదివారం రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. ‘అభ్యుదయ సామాజిక పరివర్తన’కు సుప్రీంకోర్టు బాటలు వేసిందన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి రెండు దశాబ్దాల కిందట రూపొందించిన ‘విశాఖ గైడ్‌లైన్స్‌'.. సైన్యంలో పురుషులతో పాటు మహిళలకు సమాన హోదా కల్పిస్తూ సుప్రీంకోర్టు ఈ నెలలో ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. సుప్రీంకోర్టు తీర్పులు సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేలా 9 స్థానిక భాషల్లో అందుబాటులోకి తీసుకురావడంపై హర్షం వ్యక్తంచేశారు. సర్వోన్నత న్యాయస్థానం జారీచేసిన చారిత్రక తీర్పులు దేశ న్యాయ, రాజ్యాంగ వ్యవస్థలను ధృడం చేశాయని చెప్పారు. సాంకేతికత నానాటికీ కొత్తపుంతలు తొక్కుతుండడంతో డేటా భద్రత, గోప్యత హక్కు వంటి అంశాల్లో న్యాయవ్యవస్థకు సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పులను ప్రపంచంలోని వివిధ దేశాల కోర్టు ల్లో ప్రస్తావిస్తున్నారని, ఫలితంగా స్వతంత్ర, అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్‌ ఆశాదీపంగా మారిందని చెప్పారు.  


logo