శుక్రవారం 23 అక్టోబర్ 2020
National - Sep 18, 2020 , 07:35:13

కేంద్రమంత్రి హర్‌సిమ్రత్‌ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి

కేంద్రమంత్రి హర్‌సిమ్రత్‌ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ : కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాద్‌ తన పదవికి రాజీనామా చేయగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు. మంత్రిత్వశాఖ బాధ్యతలను మరో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌కు అప్పగించారు. వ్యవసాయ మార్కెట్లను సరళీకృతం చేయాలని కోరుతూ తీసుకువచ్చిన చట్టాన్ని నిరసిస్తూ హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ గురువారం కేంద్ర కేబినెట్‌ పదవికి రాజీనామా చేశారు. రైతు వ్యతిరేక ఆర్డినెన్స్‌లు, చట్టాలకు నిరసనగా రాజీనామా చేస్తూ ప్రధాని కార్యాలయంలో లేఖను అందించారు. రైతులకు, వ్యవసాయానికి సంబంధించిన బిల్లుల విషయంలో ప్రభుత్వ నిర్ణయంతో శిరోమణి అకాళీదళ్‌ విభేదించింది. లోక్‌సభలో  జరుగుతున్న చర్చల సందర్భంగా తమ నిరసన కూడా ఆ పార్టీ నేత సుఖ్‌బీర్‌ బాదల్ తెలిపారు.

రెండు వ్యవసాయ బిల్లులకు సంబంధించి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని శిరోమణి అకాళీదళ్‌ నిర్ణయించింది. బిల్లులకు నిరసనగా మంత్రి పదవులు వదులుకోవాలని కూడా నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినా ఎన్డీయేలోనే కొనసాగనున్నట్లు సమాచారం. గతంలో  శిరోమణి అకాళీదళ్ అధ్యక్షుడిగా, పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ భార్యే హర్‌సిమ్రత్ కౌర్. 2009లో ఆమె రాజకీయాల్లోకి రాగా అప్పటి నుంచి మూడుసార్లు భటిండా లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. మోదీ ప్రభుత్వంలో  రెండోసారి కేబినెట్ మంత్రి పదవి చేపట్టారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo