మంగళవారం 26 మే 2020
National - May 13, 2020 , 07:54:41

బిడ్డకు జన్మనిచ్చిన 2 గంటలకే 150 కి.మీ. నడక

బిడ్డకు జన్మనిచ్చిన 2 గంటలకే 150 కి.మీ. నడక

భోపాల్‌ : రెక్కాడితే కానీ డొక్కాడని వలస కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సొంతూళ్లను వదిలి ఉపాధి కోసం వేరే రాష్ర్టాలకు వెళ్లిన కార్మికుల బాధలు చూస్తుంటే కన్నీరు పెట్టక తప్పదు. ఈ వలస కార్మికుల్లోని గర్భిణుల బాధలు మనసును కలిచివేస్తున్నాయి. గర్భిణులు వందల కిలోమీటర్ల నడుస్తున్నారు. నెలలు నిండిన గర్భిణులు అయితే రోడ్డు పక్కనే బిడ్డలకు జన్మనిస్తున్నారు. 

మధ్యప్రదేశ్‌ సాత్నా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన రాకేశ్‌ కౌల్‌, శకుంతల దంపతులు.. కొన్నాళ్ల క్రితం మహారాష్ట్రలోని నాసిక్‌కు వలస వెళ్లారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమల్లో ఉండటంతో వారికి ఉపాధి కరువైంది. దీంతో తమ సొంతూరుకు వెళ్లాలని రాకేశ్‌ దంపతులు నిర్ణయించుకున్నారు. శంకుతల నిండు గర్భిణి. అయినప్పటికీ తమ నడకను నాసిక్‌ నుంచి మే 5వ తేదీన సాత్నాకు ప్రారంభించారు. 70 కిలోమీటర్ల నడక అనంతరం.. ఆగ్రా - ముంబయి జాతీయ రహదారి పక్కన శకుంతల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకుని.. మళ్లీ నడక ప్రారంభించింది శకుంతల. తన పసిబిడ్డను ఎత్తుకుని.. ఎర్రటి ఎండలో 150 కిలోమీటర్లకు పైగా నడిచింది ఆ బాలింత. 

మార్గమధ్యలో బాలింతను గమనించిన ఓ సిక్కు కుటుంబం వారిని ఆదరించింది. పసిపాపకు దుస్తులు ఇచ్చి.. ఆహారం అందించారు. ఇక మహారాష్ట్ర - మధ్యప్రదేశ్‌ సరిహద్దులోని బిజాసాన్‌ చెక్‌పోస్టు వద్ద బాలింతను పోలీసులు గుర్తించారు. బాలింత తన బిడ్డను చేతుల్లో ఎత్తుకుని ఉన్న దృశ్యాలను చూసి పోలీసులు చలించిపోయారు. పోలీసులు.. బాలింతను సురక్షితంగా వారి సొంతూరుకి చేర్చారు. బిడ్డ జన్మించిన తర్వాత సుమారు 150 కిలోమీటర్లు నడక సాగించినట్లు శకుంతల చెప్పడంతో పోలీసులు ఉద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 


logo