ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 17:25:21

గర్భిణిని పెద్ద పాత్రలో నది దాటించిన కుటుంబ సభ్యులు

గర్భిణిని పెద్ద పాత్రలో నది దాటించిన కుటుంబ సభ్యులు

రాయ్‌పూర్: ఒక నిండు గర్భిణిని కుటుంబ సభ్యులు పెద్ద పాత్రలో ఉంచి నదిని దాటించి దవాఖానకు తీసుకెళ్లారు. అనంతరం డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యహరించడంతో ఆ మహిళ ఒక మృత శిశువునకు జన్మనిచ్చింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. గొర్ల గ్రామానికి చెందిన గర్భిణికి ఈ నెల 14న నొప్పులు వచ్చాయి. మరోవైపు నది అవతల సుమారు 15 కిలోమీటర్ల దూరంలో దవాఖాన ఉన్నది.

అయితే ఆ నదిని దాటేందుకు వంతెన లేదు. దీంతో చేసేదేమీలేక కుటుంబ సభ్యులు ఆ గర్భిణిని ఒక పెద్ద పాత్రలో ఉంచి మెల్లగా నదిని దాటించారు. అనంతరం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న దవాఖానకు తీసుకెళ్లారు. మరునాడు ఆమెకు ప్రసవ నొప్పులు అధికమయ్యాయి. మరోవైపు తమ డ్యూటీ అయిపోవడంతో ప్రసవానికి ఇంకా సమయం ఉందంటూ డాక్టరు, నర్సులు వెళ్లిపోయారు. తరువాత షిఫ్టు డాక్టరు, నర్సులు చాలా సేపటి తర్వాత వచ్చారు.

ఇంతలో ఆ మహిళకు పురిటి నొప్పులు ఎక్కువ కాగా చివరకు ఒక మృత శిశువుకు జన్మనిచ్చింది. కాగా, దవాఖాన సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే శిశువు మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరోవైపు ఈ ఘటనపై వైద్యాధికారులు స్పందించారు. సంబంధిత డాక్టర్, నర్సులకు నోటీసు పంపుతామని, వారు ఇచ్చిన సమాధానం ఆధారంగా తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు లేఖ రాస్తామని భోపాల్‌పట్నం వైద్యాధికారి అజయ్ రామ్‌టేకే తెలిపారు.logo