బుధవారం 08 జూలై 2020
National - Jun 04, 2020 , 01:51:34

మనిషిది మోసం.. గజరాజుది నిగ్రహం

మనిషిది మోసం.. గజరాజుది నిగ్రహం

తిరువనంతపురం: ఓవైపు కడుపులో బిడ్డ.. మరోవైపు తట్టుకోలేని ఆకలి.. ఇంకోవైపు నరాల్ని మెలిపెడుతున్న బాధ. ఇలాంటి సమయంలో భారీ కాయమున్న ఏ జంతువైనా ఏం చేస్తుంది? సమీప గ్రామాలపై విరుచుకుపడుతుంది. ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగిస్తుంది. అయితే ఆ ఏనుగు మాత్రం కొండంత బాధను పంటి బిగువున అణుచుకుంటూ.. పేలుడు కారణంగా రక్తమోడుతున్న నోరు, దవడల గాయాలకు ఉపశమనం పొందేందుకు కొన్నిరోజులపాటు నీటిలోనే ఉండిపోయింది.

చివరకు ఆకలి, గాయాల కారణంగా ప్రాణాలు విడిచింది. హృదయ విదారకమైన ఈ ఘటన కేరళలో ఇటీవల జరిగింది. ‘ఆహారం కోసం తిరుగుతున్న ఓ ఏనుగు ఓ పండును తిన్నది. అయితే ఆ పండులో పేలుడు పదార్థాలు ఉండటంతో దాని దవడలు, నోటికి  తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధను తాళలేక సమీపంలోని ఓ నదిలోకి దిగింది. తన నోటిని నీటిలోకి ముంచి ఉపశమనాన్ని పొందింది. ఆహారంలేకపోవడం, గాయాల తీవ్రత ఎక్కువ కావడంతో గతనెల 27న ప్రాణాలు విడిచింది’ అని అటవీ అధికారి మోహనన్‌ కృష్ణన్‌ పేర్కొన్నారు. ఏనుగుకు పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించగా అది నెలరోజుల గర్భిణి అని తేలిందని చెప్పారు. గాయాల తో ఉన్నప్పటికీ ఏనుగు ఎవరికీ హాని చేయలేదన్నారు. కాగా, ఈఘటనపై కేరళ సర్కార్‌ దర్యాప్తునకు ఆదేశించింది. కేంద్రం రాష్ర్టాన్ని నివేదిక కోరింది. కాగా కొందరు తుంటరి వ్యక్తులు ఏనుగుకు పండు ఇచ్చినట్టు తెలుస్తున్నది. logo