గురువారం 16 జూలై 2020
National - Jun 23, 2020 , 15:51:59

ఢిల్లీ అల్ల‌ర్ల కేసు.. గ‌ర్భిణి సఫురా జార్గ‌ర్ కు బెయిల్

ఢిల్లీ అల్ల‌ర్ల కేసు.. గ‌ర్భిణి సఫురా జార్గ‌ర్ కు బెయిల్

న్యూఢిల్లీ : ఢిల్లీ అల్ల‌ర్లకు సంబంధించిన కేసులో ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ట్టం కింద అరెస్టు అయిన జామియా మిలియా యూనివ‌ర్సిటీ విద్యార్థిని స‌ఫురా జార్గార్ కు ఎట్ట‌కేల‌కు బెయిల్ ముంజూరైంది. ఆమె ప్ర‌స్తుతం  గ‌ర్భిణి. అయితే ఆమెకు బెయిల్ ఇవ్వొద్ద‌ని ఢిల్లీ హైకోర్టుకు పోలీసులు విన్న‌వించారు. మాన‌వ‌తా కోణంలో ఆలోచించిన కోర్టు.. స‌ఫురాకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

ఈ కేసు ద‌ర్యాప్తుకు ఆటంకం క‌లిగించొద్ద‌ని జార్గార్ ను కోర్డు ఆదేశించింది. అనుమ‌తి లేకుండా ఢిల్లీ విడిచి వెళ్లొద్ద‌ని సూచించింది. ప‌దిహేను రోజుల‌కు ఒక‌సారి విచార‌ణ అధికారితో ఫోన్లో అందుబాటులో ఉండాల‌ని కోర్టు తెలిపింది. రూ. 10 వేల పూచీక‌త్తు ఇవ్వాల‌ని స‌ఫురాను కోర్టు ఆదేశించింది. 

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చేప‌ట్టిన క్ర‌మంలో ఫిబ్ర‌వ‌రిలో త‌లెత్తిన అల్ల‌ర్ల కేసులో స‌ఫురాను ఏప్రిల్ 10న పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో ఆమెకు బెయిల్ మంజూరైంది. కానీ మ‌ళ్లీ ఆమెపై మ‌రిన్ని ఆరోప‌ణ‌లు మోపుతూ.. మ‌ళ్లీ అరెస్టు చేసి తీహార్ జైలుకు త‌ర‌లించారు. 

జామియా మిలియా ఇస్లామియా వ‌ర్సిటీలో ఎంఫిల్ చ‌దువుతున్న ఆమెను ప్ర‌స్తుతం తీహార్ జైలులో ఉంచారు. గ‌ర్భ‌వ‌తి అయిన ఆమె.. బెయిల్ ఇవ్వాలంటూ సోమ‌వారం జైలుకు అభ్య‌ర్థ‌న పెట్టుకున్న‌ది. అయితే ప్రెగ్నెన్సీ ఆధారంగా బెయిల్ ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని ఢిల్లీ పోలీసులు తేల్చి చెప్పారు.  గ‌త ప‌దేళ్ల‌లో తీహార్ జైలులో 39 మంది గ‌ర్భిణుల‌కు ప్ర‌స‌వం జ‌రిగింద‌ని తెలిపారు.  ఢిల్లీ హైకోర్టుకు తీహార్ జైలు అధికారులు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. 

స‌ఫూరా జ‌ర్గార్ గ‌ర్భిణ అయినంత మాత్రాన ఆమె చేసిన నేరం త‌క్కువేమీ కాదు అని ఢిల్లీ పోలీసులు కోర్టుకు చెప్పారు. జైలులోనే ఆమెకు అన్ని వైద్య స‌దుపాయాలు క‌ల్పిస్తున్న‌ట్లు జైల‌ర్ తెలిపారు. సుప్రీంకోర్టు సూచ‌న‌ల మేర‌కు గ‌ర్భిణుల‌కు అన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తున్న‌ట్లు జైల‌ర్ తెలియ‌జేశారు.  స‌ఫూరా జ‌ర్గార్‌కు ప్ర‌త్యేక చికిత్స ఇవ్వ‌డం కుద‌ర‌ద‌న్నారు. స్పెష‌ల్ సెల్ డీసీపీ పీఎస్ కుశ్వాహ్ ఈ రిపోర్ట్‌ను త‌యారు చేశారు.  మొత్తానికి సఫురాకు మంగ‌ళ‌వారం బెయిల్ మంజూరైంది.


logo