గురువారం 26 నవంబర్ 2020
National - Oct 30, 2020 , 19:11:01

‘2019 ఆగస్టు 5 ముందు పరిస్థితిని పునరుద్ధరించాల్సిందే..’

‘2019 ఆగస్టు 5 ముందు పరిస్థితిని పునరుద్ధరించాల్సిందే..’

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో 2019 ఆగస్టు 5 ముందున్న పొజిషన్‌ను పునరుద్ధరించాల్సిందేనని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన కార్గిల్‌ను సందర్శించి స్థానిక నేతలతో సమావేశమయ్యారు. జమ్ముకశ్మీర్‌ ఏకీకరణ, ఆర్టికల్‌ 370 పునరుద్ధరణకు గుప్కర్ డిక్లరేషన్ కోసం ఏర్పడిన పీపుల్స్ అలయన్స్ ప్రతినిధి బృందం కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ నాయకులను కలిసి దీనిపై చర్చలు జరిపింది. జమ్ముకశ్మీర్‌లో 2019 ఆగస్టు 5 ముందున్న పొజిషన్‌ను పునరుద్ధరించాల్సిందేనని ఈ సందర్భంగా ఒమర్‌ అబ్దుల్లా డిమాండ్‌ చేశారు. దీని కోసం తామంతా కలిసి ముందుకు సాగుతామని చెప్పారు.

తమ పోరాటం దేశానికి వ్యతిరేకంగా కాదని ఒమర్‌ తెలిపారు. బీజేపీ, దాని సిద్ధాంతాలకు వ్యతిరేకంగానే తమ పోరాటమని చెప్పారు. బీజేపీనే దేశం కాదు.. దేశం బీజేపీ కాదని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్‌కు సంబంధించి రాజ్యాంగంలో రాసినదే తమకు కావాలని చెప్పారు. దీని కోసం తాము జరుపుతున్న పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఒమర్‌ అబ్దుల్లా స్పష్టం చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.