శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 17:01:21

రైతులకు సౌర విద్యుత్ ఇచ్చే పీఎంకేవై

రైతులకు సౌర విద్యుత్ ఇచ్చే పీఎంకేవై

న్యూఢిల్లీ : రైతుల ప్రయోజనాలను ఆశించి కేంద్ర ప్రభుత్వ మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానమంత్రి కుసుం యోజన పథకం కింద వందలాది మంది రైతులకు సౌర విద్యుత్ ప్లాంట్లు కేటాయించనున్నారు. రైతుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. 

ఫార్మర్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ అప్లిఫ్ట్మెంట్ క్యాంపెయిన్ (కుసుమ్) పథకం కింద దేశవ్యాప్తంగా నీటిపారుదల కోసం ఉపయోగించే అన్ని డీజిల్ / ఎలక్ట్రిక్ పంపులను సౌర శక్తితో నడిపే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కుసుమ్ యోజన కింద బ్యాంకులు 30 శాతం మొత్తాన్ని రైతులకు రుణంగా చెల్లిస్తాయి. మిగిలిన మొత్తాన్ని రైతులకు బ్యాంకు ఖాతాలో సబ్సిడీగా కేంద్రం ఇస్తుంది. 

రైతులకు మేలు చేసే పథకం

బంజరు, ఉపయోగించలేని భూమిలో ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ భూముల్లో ​​0.5 నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయవచ్చు. దీని ద్వారా రైతులు తమ భూమి ద్వారా 25 సంవత్సరాలపాటు క్రమం తప్పకుండా ఆదాయం అందుకొనే వీలుంది. దీంతోపాటు రైతులు పగటిపూట వ్యవసాయ పనులకు సులభంగా విద్యుత్తును పొందగలుగుతారు. వీటితో పాటు, పంపిణీ సంస్థల విద్యుత్ పంపిణీ వ్యయం, వ్యవస్థ విస్తరణపై తగ్గింపు ఉంటుంది. 

1878 మెగావాట్ల కోసం త్వరలో ప్రక్రియ

రైతుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని 2019-20 బడ్జెట్ లో రైతుల భూమిలో మొత్తం 2,600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజితాబ్ శర్మ చెప్పారు. ఈ లక్ష్యాన్ని రాబోయే మూడేండ్లలో సాధించాలని ప్రతిపాదించారు. కుసుమ్ పథకం కింద మొదటి దశలో 722 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటు చేసి.. మిగిలిన 1878 మెగావాట్ల సామర్థ్యానికి కూడా త్వరలో ప్రక్రియ ప్రారంభం కానున్నది.


logo