మంగళవారం 22 సెప్టెంబర్ 2020
National - Aug 04, 2020 , 16:33:21

రైతు సంక్షేమం కోసం ప‌నిచేస్తా: సివిల్స్ టాప‌ర్‌ ప‌్ర‌దీప్

రైతు సంక్షేమం కోసం ప‌నిచేస్తా:  సివిల్స్ టాప‌ర్‌ ప‌్ర‌దీప్

హైద‌రాబాద్‌:  సివిల్‌ స‌ర్వీస్ ప‌రీక్ష‌(2019)లో ప్ర‌దీప్ సింగ్ టాప్ ర్యాంక్ సాధించారు.  సీఎస్ఈ పరీక్ష‌లో రెండ‌వ, మూడ‌వ ర్యాంక్‌ల‌ను జ‌తిన్ కిషోర్‌, ప్ర‌తిభావ‌ర్మ‌లు కైవ‌సం చేసుకున్నారు.  ఈ ఏడాది తొలిసారి ఆర్థికంగా వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల‌కు ప‌ది శాతం కోటాను అమ‌లు చేశారు.  యూపీఎస్‌సీ ఇవాళ సివిల్స్ ఫ‌లితాల‌ను రిలీజ్ చేసింది.  వివిధ స‌ర్వీసుల‌కు 829 మందిని ఎంపిక చేశారు. దాంట్లో 66 మందిని ప్రొవిజిన‌ల్‌గా రిక‌మండ్ చేశారు.  మ‌రో 11 మంది ఫ‌లితాల‌ను విత్‌హెల్డ్‌లో పెట్టారు. సెప్టెంబ‌ర్ 2019లో జ‌రిగిన రాత‌ప‌రీక్ష ఆధారంగా యూపీఎస్‌సీ సివిల్స్ ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి ఆగ‌స్టు మ‌ధ్య రాత‌ప‌రీక్ష‌లో ఎంపికైన వారికి ఇంట‌ర్వ్యూ ప‌ర్స‌నాల్టీ టెస్ట్‌ను పెట్టారు.  ఈడ‌బ్ల్యూఎస్ క్యాట‌గిరీలో మొత్తం 78 మందిని ఎంపిక చేశారు.  జ‌న‌ర‌ల్ క్యాట‌గిరీలో 304 మంది ఎంపిక‌య్యారు.  251 మంది ఓబీసీ నుంచి 129 మంది షెడ్యూల్ కులాలు, 67 మంది షెడ్యూల్ తెగ‌కు చెందిన‌వారు ఉన్నారు.  ర్యాంక్‌లు సాధించిన వారందంరూ ఐఏఎస్‌, ఐపీఎస్‌, సెంట్ర‌ల్ స‌ర్వీసెస్ గ్రూప్ ఏ, గ్రూప్ బీ పోస్టుల్లో చేరుతారు. సివిల్స్ స‌ర్వీసెస్‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు కంగ్రాట్స్ చెబుతూ ఐఏఎస్ సంఘం ట్వీట్ చేసింది. 

ప్ర‌దీప్ సింగ్‌ది హ‌ర్యానాలోని సోనిపాట్ జిల్లా.  గ‌త ఏడాది కూడా అత‌ను సివిల్స్ క్లియ‌ర్ చేశాడు.  ప్ర‌స్తుతం అత‌ను హ‌ర్యానాలోని ఫ‌రీదాబాద్‌లో ఇండియ‌న్ రెవ‌న్యూ స‌ర్వీస్ ఆఫీస‌ర్‌గా శిక్ష‌ణ పొందుతున్నాడు. సోనిపాట్ జిల్లాలోని తేవ్రీ గ్రామంలో ప్ర‌దీప్ తండ్రి సుఖ్‌బీర్ సింగ్ స‌ర్పంచ్‌గా చేస్తున్నారు.  ప్ర‌దీప్ పేరెంట్స్ సోనిపాట్ జిల్లాలోని ఓమెక్స్ ప‌ట్ట‌ణంలో ఉంటున్నారు.  త‌న తండ్రి రైతు అని, ఐఏఎస్ ఆఫీస‌ర్ కావాల‌ని తండ్రి ప్రోత్స‌హించార‌ని, రైతు సంక్షేమం కోసం కృషి చేస్తాన‌ని ప్ర‌దీప్ తెలిపారు.  ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌దీప్ నాలుగు సార్లు సివిల్స్ ప‌రీక్ష‌లు రాశాడు.  గ‌త ఏడాది అత‌నికి 260వ ర్యాంక్ వ‌చ్చింది. 


logo