గురువారం 21 జనవరి 2021
National - Dec 18, 2020 , 01:52:12

ఇక ఫుల్‌ సిగ్నల్‌

ఇక ఫుల్‌ సిగ్నల్‌

  • నింగిలోకి శక్తిమంతమైన సీబ్యాండ్‌ శాటిలైట్‌ 
  • పీఎస్‌ఎల్వీ-సీ 50 రాకెట్‌ ద్వారా కక్ష్యలోకి సీఎంఎస్‌-01
  • టెలికం, శాటిలైట్‌ కమ్యూనికేషన్‌లో మెరుగైన సేవలు
  • అండమాన్‌-నికోబార్‌, లక్షద్వీప్‌లకూ సీబ్యాండ్‌ విస్తరణ
  • వాతావరణ పరిశీలన, నిఘాలో మరింత కచ్చితత్వం

చెన్నై, డిసెంబర్‌ 17: దేశంలో టెలికం, కమ్యూనికేషన్‌ సేవల్లో నాణ్యత ఇక మరింత పెరుగనున్నది. వాతావరణ మార్పులు, సరిహద్దులు.. దేశ అంతర్గత నిఘాకు మరింత కచ్చితత్వం రానున్నది. వై- ఫై, కార్డ్‌లెస్‌ ఫోన్లు తదితర కమ్యూనికేషన్‌ సేవలను మరింత మెరుగుపర్చే ఉద్దేశంతో తయారుచేసిన సీఎంఎస్‌-01 ఉపగ్రహం అంతరిక్షంలోకి చేరి పని ప్రారంభించింది. ‘సీ-బ్యాండ్‌' ఫ్రీక్వెన్సీని భారత ప్రధాన భూభాగంతోపాటు అండమాన్‌-నికోబార్‌, లక్షదీవులకు కూడా మెరుగ్గా అందించగల ఈ ఉగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్‌ ఉపగ్రహ ప్రయోగకేంద్రంలోని రెండో లాంచ్‌ప్యాడ్‌ నుంచి పీఎస్‌ఎల్వీ-సీ50 రాకెట్‌ మధ్యాహ్నం 3.41 గంటలకు విజయవంతంగా మోసుకెళ్లింది. ఇస్రోకు అత్యంత నమ్మకమైన ఈ రాకెట్‌ 20 నిమిషాల్లోనే ఉపగ్రహాన్ని భూ కక్షలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయంపై ఇస్రో ఛైర్మన్‌ కే శివన్‌ సంతోషం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అభినందనలు తెలియజేశారు. ‘ముందుగా అనుకున్న ప్రకారం సబ్‌-జియోసింక్రొనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (జీటీవో)లోకి ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ-సీ50 విజయవంతంగా చేర్చింది. ‘ఉపగ్రహంలోని సోలార్‌ ప్యానెల్స్‌ విజయవంతంగా తెరుచుకున్నాయి. మరో నాలుగు రోజుల్లో నిర్ణీత కక్ష్యలోకి సీఎంఎస్‌-01 చేరుకుంటుంది’ అని శివన్‌ చెప్పారు.

సేవల విస్తరణ

కమ్యూనికేషన్‌ శాటిలైట్‌లలో సీఎంఎస్‌-01 ఉపగ్రహం 42వది. దీని జీవితకాలం ఏడేండ్లు. సమాచార సేవల కోసం 11 ఏండ్ల కిందట ప్రయోగించిన జీశాట్‌-12 ఉపగ్రహం జీవితకాలం ముగియనున్న నేపథ్యంలో దాని స్థానంలో సీఎంఎస్‌-01ను ఇస్రో ప్రయోగించింది. ఇంతకుముందటి జీశాట్‌-12 ఉపగ్రహం ద్వారా సీ-బ్యాండ్‌ సేవలు అండమాన్‌-నికోబార్‌, లక్షద్వీప్‌ తప్ప దేశంలోని ఇతర ప్రాంతాలకే పరిమితమయ్యేవి. తాజా ప్రయోగంతో ఈ సేవలు అండమాన్‌-నికోబార్‌, లక్షద్వీప్‌లకూ విస్తరించనున్నాయి.

ప్రైవేట్‌ ముద్ర

త్వరలో చేపట్టనున్న ‘పీఎస్‌ఎల్వీ-సీ 51’ ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన ప్రైవేట్‌ సంస్థలు తొలిసారిగా ఇస్రోతో చేతులు కలుపబోతున్నట్టు శివన్‌ వెల్లడించారు. ‘పీఎస్‌ఎల్వీ-సీ 51’ ప్రయోగం ద్వారా ‘పిక్సెల్‌' ప్రైవేట్‌ కంపెనీ అభివృద్ధి చేసిన ‘ఆనంద్‌'తో పాటు ‘స్పేస్‌ కిడ్స్‌ ఇండియా’కు చెందిన ‘సతీశ్‌ శాట్‌', కన్సార్టియం ఆఫ్‌ యూనివర్సిటీలకు చెందిన ‘యూనిట్‌శాట్‌' ఉపగ్రహాలను రోదసిలోకి పంపబోతున్నట్టు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని అనుమతిస్తూ కేంద్రం ఈ జూన్‌లో పలు సంస్కరణలు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. 

‘సీ-బ్యాండ్‌' అంటే ఏమిటి?

4 నుంచి 8 గిగా హెర్జ్‌ల పౌనఃపున్యం కలిగిన విద్యుదయస్కాంత తరంగాలను ‘సీ-బ్యాండ్‌'గా పిలుస్తారు. ఉపగ్రహాల నుంచి భూమి మీదనున్న స్టేషన్లకు సమాచార బదిలీ, వై-ఫై డివైజ్‌లు, కార్డ్‌లెస్‌ టెలిఫోన్లలో మెరుగైన సేవలకు ఈ బ్యాండ్‌ ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తారు. నిఘా, వాతావరణ పరిస్థితులను అంచనా వేసే రాడార్‌ వ్యవస్థల్లో  కూడా ‘సీ-బ్యాండ్‌' సేవల్ని వినియోగిస్తారు. 


logo