గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 03:12:46

విద్యుత్‌ ప్రైవేటీకరణను అంగీకరించబోం

విద్యుత్‌ ప్రైవేటీకరణను అంగీకరించబోం

  • కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా పుదుచ్చేరి అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

పుదుచ్చేరి: విద్యుత్‌ పంపిణీ సంస్థలను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పుదుచ్చేరి అసెంబ్లీ బుధవారం ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌ కమలాకన్నన్‌ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, పార్టీలకతీతంగా సభ్యులు మద్దతు తెలిపారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు డిప్యూటీ స్పీకర్‌ ఎమ్‌ఎన్‌ఆర్‌ బాలన్‌ ప్రకటించారు. అంతకుముందు విద్యుత్‌ శాఖ మంత్రి మాట్లాడుతూ.. విద్యుత్‌ ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదని, ఇది వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. ఆదాయం కోసం ప్రైవేట్‌ సంస్థలు నిత్యం టారిఫ్‌లను పెంచుతాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ.. కేంద్రం నిర్ణయంపై అభ్యంతరం తెలుపుతూ ఇప్పటికే తాను కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రికి లేఖ రాసినట్లు చెప్పారు. కేంద్రం ముందుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందని పేర్కొన్నారు. చట్టసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అని, కేంద్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం తగదని స్పష్టంచేశారు. తమ ప్రభుత్వం రైతులకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నదని, అలాగే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు 100 యూనిట్ల వరకు ఎలాంటి చార్జి వసూలు చేయడం లేదని చెప్పారు. విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరిస్తే ప్రజలకు ఇవన్నీ దూరమవుతాయని, వినియోగదారులపై ప్రైవేట్‌ సంస్థలు పెద్ద ఎత్తున చార్జీలను మోపే ప్రమాదం ఉన్నదన్నారు.logo