గురువారం 26 నవంబర్ 2020
National - Oct 31, 2020 , 13:09:57

ఉప ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తాం : కమల్‌నాథ్‌

ఉప ఎన్నికల తర్వాత  అధికారంలోకి వస్తాం : కమల్‌నాథ్‌

భోపాల్ : త్వరలో జరుగబోయే ఉప ఎన్నికల తర్వాత మధ్యప్రదేశ్‌లో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం కమల్‌నాథ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్చిలో జ్యోతిరాధిత్య సింధియా వర్గం కాంగ్రెస్‌పై తిరుగుబావుటా ఎగుర వేయడంతో ఆయన వర్గీయులు పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కమల్‌నాథ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది. రాష్ట్రంలోని 28 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 3న ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోకి తిరిగి అధికారం రావాలంటే కాంగ్రెస్‌ 28 స్థానాలను గెలుచుకోవాల్సి ఉండగా.. అధికార బీజేపీకి తొమ్మిది సీట్లు వస్తే బలం 230కి చేరుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లపై నాకు పూర్తి నమ్మకం ఉందన్నారు. నవంబర్‌ 10న బైపోల్స్‌ ఓట్ల లెక్కింపు తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్‌ వస్తుందన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎన్ని సీట్లు గెలుస్తుందని అడిగి ప్రశ్నకు ‘నేను ప్రకటించడంలో నమ్మకం లేదు.. సీఎం (శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌) అందులో నిపుణుడు అన్నారు. అలాగే ఎన్నికల ప్రచారంలో ‘ఐటమ్‌’ అనే పదాన్ని ఉపయోగించడాన్ని సమర్థించుకున్నారు. ‘నేను చాలా సంవత్సరాలు లోక్‌సభలో ఉన్నాను. అక్కడ ఎజెండా షీట్‌లో ఐటమ్‌ నంబర్‌ 1, ఐటమ్‌ నంబర్‌ 2 ఉన్నాయని.. అది నా మనస్సులో ఉంది. ఎవరినీ అగౌరవపరిచేలా నేను చెప్పలేదు. ఎవరినైనా అవమానించినట్లు భావిస్తే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను’ అన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.