ముంబై: ప్రముఖ వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదార్ పూనావాలాగా నమ్మించిన మోసగాళ్లు ఆ సంస్థ నుంచి కోటికిపైగా లూటీ చేశారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. ఎస్ఐఐ డైరెక్టర్లలో ఒకరైన సతీష్ దేశ్‌పాండే వాట్సాప్‌కు సెప్టెంబర్‌లో ఒక మేసేజ్ వచ్చింది. అదార్ పూనావాలాగా నమ్మించిన ఒక వ్యక్తి పలు బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేయాలని ఆ మెసేజ్‌లో పేర్కొన్నాడు. అయితే ఆ వాట్సాప్ మెసేజ్ అదార్ నుంచి వచ్చినట్లుగా డెరెక్టర్ సతీష్ భావించారు. దీంతో ఆ మేజేస్లో పేర్కొన్న 8 బ్యాంకు ఖాతాలకు రూ.1.01 కోట్లను ట్రాన్స్ఫర్ చేశారు.
కాగా, మోసం జరిగినట్లు ఆ సంస్థ వెంటనే గ్రహించింది. దీంతో చీటింగ్ చేసి కోటికిపైగా దోచుకున్న వ్యవహారంపై పూణే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స్పందించారు. డబ్బులు బదిలీ అయిన ఎనిమిది బ్యాంకు ఖాతాలతోపాటు వాటి నుంచి మనీ ట్రాన్స్ఫర్ అయిన మరో 40 బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపజేశారు.
మరోవైపు ఈ స్కామ్‌కు సంబంధించి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన ఏడుగురు నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేసినట్లు జోన్ 2 డీసీపీ స్మార్తనా పాటిల్ తెలిపారు. అయితే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఆయా బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.13 లక్షలను కూడా ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు.