గురువారం 02 జూలై 2020
National - Mar 31, 2020 , 02:12:49

‘వలస’దారులు

‘వలస’దారులు

  • రోడ్లపైకి పేదలు, వలసకార్మికులు 
  • నగరాలు వదిలి సొంతూళ్లకు ప్రయాణం
  • దేశవ్యాప్తంగా హైవేలపై ఇదే పరిస్థితి 

న్యూఢిల్లీ: పేదలు, వలస కార్మికులకు లాక్‌డౌన్‌ జీవన్మరణ సమస్యగా మారింది. నగరాల్లో ఉండి ఆకలితో చావడం కన్నా.. సొంతూరుకు వెళ్లి కలోగంజో తాగి బతుకుదామని వారంతా నిర్ణయించుకున్నారు. రవాణా నిలిచిపోవడంతో కుటుంబం మొత్తం కలిసి నడకమొదలుపెట్టారు. ఇలా దేశవ్యాప్తంగా లక్షల మంది వలసజీవులు రోడ్లపై కాలినడకన సొంతూళ్లకు బయలుదేరారు. ఈ దృశ్యం 1947లో దేశ విభజన సమయంలో జరిగిన వలసలను గుర్తుచేస్తున్నదని పలువురు చెప్తున్నారు. చాలామంది ఆహారం దొరుకక, నడువలేక అనారోగ్యంబారిన పడుతున్నారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 22 మంది వలసకూలీలు మరణించారు. ‘కరోనా కన్నా ముందే ఆకలితో చనిపోయేలా ఉన్నాం. రెండు రోజులుగా తిండిలేదు. అందుకే సొంతూరుకు బయల్దేరాం’ అని ఢిల్లీ నుంచి వలసవెళ్తున్న రేణుకాదేవి చెప్పారు. భర్త, ఇద్దరు పిల్లలు కలిసి 370 కి.మీ దూరంలోని  సొంతూరుకు ఆదివారం బయల్దేరారు. ‘ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని ప్రభుత్వం చెప్తున్నది. కానీ.. తినడానికి తిండి కూడా లేనప్పుడు ఇక్కడుండి ఏం చేయాలి? మా పిల్లల్ని ఎలా బతికించుకోవాలి’ అని యూపీకి చెందిన నేహా కశ్యప్‌ అనే గృహిణి నిలదీస్తున్నారు. ‘ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. కరోనా వైరస్‌ కన్నా ఎక్కువమంది ఆకలితోనే చనిపోయేలా ఉన్నారు’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ముంబై నుంచి వందల మంది కార్మికులు  600 కి.మీ దూరంలోని కర్ణాటకకు ప్రయాణమయ్యారు.  కాగా, ఈ వలసలు ప్రమాదకరమని వైద్యనిపుణులు గంగదీప్‌ కాంగ్‌ హెచ్చరిస్తున్నారు. దేశంలో తగినన్ని కరోనా పరీక్షలు చేయడం లేదని, ఎంతమందికి వ్యాధి ఉన్నదో నిర్ధారించడం కష్టమన్నారు. వలస వెళ్తున్నవారిలో వైరస్‌ ఉంటే వారి సొంతూర్లలో వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదని హెచ్చరించారు.


logo