బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 21, 2020 , 03:08:32

వారసత్వానికి సవాల్‌!

వారసత్వానికి సవాల్‌!

  • ఇద్దరు యువ నేతల భవితవ్యం తేల్చనున్నబీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు
  • తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టేందుకుతేజస్వియాదవ్‌, చిరాగ్‌ పాశ్వాన్‌ కృషి
  • ఎన్నికల సమరాంగణంలో ఎత్తుకు పై ఎత్తులు

పాట్నా: ఇద్దరు యువకులు.. తండ్రుల నుంచి రాజకీయ పార్టీలను వారసత్వంగా పొందిన నేతలు. తండ్రుల నీడలో రాజకీయాలను నేర్చుకొని ఇప్పుడిప్పుడే సొంతంగా పార్టీలను నడుపుతున్న యువ నాయకులు. వారే రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) అధినేత తేజస్వి యాదవ్‌, లోక్‌జనశక్తి (ఎల్‌జేపీ) అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌. వారిద్దరూ ఇప్పుడు బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల రూపంలో కఠిన పరీక్ష ఎదుర్కొంటున్నారు. తేజస్వియాదవ్‌ తండ్రి, బీహార్‌ మాజీ సీఎం లాలూప్రసాద్‌యాదవ్‌ అవినీతి కేసులో జైల్లో ఉన్నారు. చిరాగ్‌ పాశ్వాన్‌ తండ్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ఇటీవలే అనారోగ్యంతో చనిపోయారు. దాంతో తండ్రులు లేకుండా ఇద్దరూ ఇప్పుడు ఎన్నికల్లో మొదటిసారి పార్టీలను నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. మరి వీరు తండ్రుల ఘన వారసత్వాన్ని నిలబెడతారా?

తొలుత తడబడ్డా.. తర్వాత పరిణతితో..

బీసీ నేతగా లాలూకు ఇప్పటికీ బీహార్‌లో గట్టి పట్టుంది. అయితే, అనుభవ రాహిత్యంతో కొన్నేండ్లుగా తేజస్వి తప్పటడుగులు వేశారు. 2015 ఎన్నికల్లో నితీశ్‌కుమార్‌తో కలిసి పోటీచేసి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా నిలిపి, డిఫ్యూటీ సీఎం పదవి చేపట్టినప్పటికీ ఆ తర్వాత వెనుకబడిపోయారు. నితీశ్‌ రాజకీయ చతురత ముందు నిలువలేకపోయారు. ఈసారి మాత్రం కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడగట్టి నాయకత్వం వహిస్తున్నారు. మరోవైపు, ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ తన తండ్రి, ప్రముఖ దళిత నాయకుడిగా పేరుపొందిన రామ్‌విలాస్‌ రాజకీయ వైభవాన్ని నిలబెట్టాలన్న పట్టుదలతో ఎన్నికల బరిలో దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సాహసోపేత నిర్ణయమే తీసుకున్నారు. సీట్ల సర్దుబాటులో అభిప్రాయ బేధాలతో అధికార ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోరాడుతున్నారు. 

యువతకే ప్రాధాన్యం

తేజస్వీ, చిరాగ్‌ ఇద్దరూ తమతమ పార్టీల తరఫున ఎక్కువమంది యువకులను బరిలోకి దింపి యువతను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈసారి ఎన్నికల్లో అన్నిపార్టీల నుంచి నేతల వారసులే ఎక్కువగా ఉండటం గమనార్హం. 243 స్థానాలున్న బీహార్‌ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి.