ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 01:56:36

‘రికార్డుల’ రాజకీయం

‘రికార్డుల’ రాజకీయం

  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ బేరసారాలు 
  • ఆడియో రికార్డును బయటపెట్టిన కాంగ్రెస్‌ 
  • ఆ గొంతు నాది కాదు: షెకావత్‌ స్పష్టీకరణ 
  • ప్రలోభాలపై ఎస్‌వోజీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు 

జైపూర్‌/ న్యూఢిల్లీ, జూలై 17: రాజస్థాన్‌లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతున్నది. కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యే బన్వర్‌లాల్‌ శర్మతో మాట్లాడిన ఆడియో రికార్డింగు క్లిప్పులు తాజాగా సంచలనం సృష్టిస్తున్నాయి. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రచేస్తున్నదని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌, అందుకు ఆధారంగా ఈ ఆడియో రికార్డులను శుక్రవారం బయటపెట్టింది. షెకావత్‌ను వెంటనే అరెస్టుచేయాలని డిమాండ్‌ చేసింది. అయితే ఆ క్లిప్పుల్లోని గొంతు తమదికాదని షెకావత్‌తోపాటు బన్వర్‌లాల్‌ శర్మ ప్రకటించారు. కాగా, తిరుగుబాటు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్‌ జారీచేసిన షోకాజ్‌ నోటీసులపై రాజస్థాన్‌ హైకోర్టు సోమవారం వరకు స్టే విధించింది.

చక్రం తిప్పిన షెకావత్‌?

అశోక్‌గెహ్లాట్‌ ప్రభుత్వ సంక్షోభంలో గజేంద్రసింగ్‌ షెకావత్‌ కీలకంగా మారారు. షెకావత్‌, బీజేపీ నేత సంజయ్‌జైన్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బన్వర్‌లాల్‌ మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలకు సంబంధించిన రెండు ఆడియో రికార్డింగు క్లిప్పులను కాంగ్రెస్‌ బయటపెట్టింది. పైలట్‌ తిరుగుబాటు వెనుక ఉన్నది ఆయనేనని ఆరోపించింది. తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన షెకావత్‌ను అరెస్టు చేయాలని కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి సుర్జేవాలా డిమాండ్‌ చేశారు. హార్స్‌ట్రేడింగ్‌పై ప్రభత్వ చీఫ్‌ విప్‌ మహేశ్‌జోషి ఫిర్యాదుతో స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ (ఎస్‌వోజీ) పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. కాగా.. కాంగ్రెస్‌ ఆరోపణలను షెకావత్‌, బన్వర్‌లాల్‌ తోసిపుచ్చారు. ఆరికార్డుల్లో ఉన్నది తమ గొంతుకాదన్నారు. కాంగ్రెస్‌ నకిలీ రికార్డులతో బీజేపీపై ఆరోపణలు చేస్తున్నదని ఆ పార్టీ కార్యదర్శి సంబిత్‌పాత్రా విమర్శించారు. తాను షెకావత్‌తో మాట్లాడలేదని, దీనిపై ఎలా ంటి విచారణకైనా సిద్ధమని బన్వర్‌లాల్‌శర్మ పేర్కొన్నారు.

అనర్హతపై స్టే 

తిరుగుబాటు నేత సచిన్‌పైలట్‌తోపాటు ఆయన వర్గం ఎమ్మెల్యేలు 18మందికి రాజస్థాన్‌ హైకోర్టులో శుక్రవారం తాత్కాలిక ఊరట లభించింది. అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషీ జారీచేసిన అనర్హత షోకాజ్‌ నోటీసులపై సోమవారం వరకు కోర్టు స్టే విధించింది. అదే రోజుకు విచారణను వాయిదా వేసింది. సచిన్‌పైలట్‌పై ప్రియాంకగాంధీ సన్నిహిత వర్గాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ఏడాదికాలంలో తనకు సీఎం పదవి ఇస్తానని హామీ ఇస్తేనే కాంగ్రెస్‌లో ఉంటానని పైలట్‌ చెప్పారని.. సోనియా, రాహుల్‌గాంధీలను కలిసి చర్చించాలని కోరినా ఆయన వెళ్లలేదని పేర్కొన్నాయి.

చిదంబరాన్ని సలహా కోరిన పైలట్‌ 

తీవ్ర ఒత్తిడిలో ఉన్న సచిన్‌పైలట్‌ కాంగ్రెస్‌ నేత పీ చిదంబరానికి ఫోన్‌ చేసి తదుపరి ఏం చేయాలన్నదానిపై సలహా అడిగారు. దీనికి ఆయన.. తిరుగుబాటు నేతలంతా తిరిగి సొంతగూటికి రావాలని సలహా ఇచ్చారు. ఈ వివరాల్ని చిదంబరమే వెల్లడించారు.

రాజస్థాన్‌ పోలీసులను అడ్డుకున్న హర్యానా పోలీసులు

హర్యానాలోని మనేసర్‌లో రిసార్టులో ఉన్న బన్వర్‌లాల్‌ స్వర నమూనాలు సేకరించేందుకు రాజస్థాన్‌ పోలీసు బృందం శుక్రవారం అక్కడికి చేరుకోగా అప్పటికే భారీగా మోహరించిన హర్యానా పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారి మధ్య వాగ్వాదం జరిగింది. రాజస్థాన్‌ పోలీసులు రిసార్టు లోపలికి వెళ్లగా అప్పటికే బన్వర్‌లాల్‌ అక్కడి నుంచి వెళ్లి పోయారు.


logo