e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home Top Slides లక్షద్వీప్‌లో అలజడి

లక్షద్వీప్‌లో అలజడి

లక్షద్వీప్‌లో అలజడి
  • పాలనాధికారి ప్రఫుల్‌ వివాదాస్పద నిర్ణయాలు
  • ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత
  • ఆయనను తొలగించాలని సర్వత్రా డిమాండ్‌
  • అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా ఆమోదించిన కేరళ

అరేబియా సముద్రంలోని లక్షద్వీప్‌లో గత కొన్ని నెలలుగా ప్రజాగ్రహం పెల్లుబుకుతున్నది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో రాజకీయ తుఫాన్‌ అలజడులు సృష్టిస్తున్నది. లక్షద్వీప్‌ పాలనాధికారిగా బీజేపీ నేత ప్రఫుల్‌ ఖోడా పటేల్‌ వచ్చినప్పటి నుంచి తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలే ఇందుకు కారణం. ప్రఫుల్‌ను తొలగించాలని స్థానికులతో పాటు పలు రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. కేరళ అసెంబ్లీ ఈ మేరకు ఒక తీర్మానం కూడా చేసింది. ప్రజా సంక్షేమం, భద్రతతోపాటు లక్షద్వీప్‌ను మాల్దీవుల మాదిరిగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం కోసమే నూతన ప్రతిపాదనలు తీసుకొచ్చినట్టు ప్రఫుల్‌ కే పటేల్‌ చెబుతున్నారు. అయితే ఇవి లక్షద్వీప్‌ సామాజిక, సాంస్కృతిక వారసత్వాన్ని దెబ్బతీస్తాయని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

బీఫ్‌పై నిషేధం
లక్షద్వీప్‌ జనాభాలో అత్యధిక శాతం ముస్లింలు. వీరికి పశుమాంసమే ప్రధాన ఆహారం. అయితే అధికారుల అనుమతి లేనిదే పశువులను వధించడంపై నిషేధం విధించారు. బీఫ్‌, బీఫ్‌ ఉత్పత్తుల రవాణా, నిల్వపైనా నిషేధం విధించారు. ఉల్లంఘిస్తే ఏడాది జైలు, పదివేల జరిమానా. ఇది తమ ఆహార అలవాట్లు, సంస్కృతిపై దాడిచేయడమేనని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇక అభివృద్ధి కోసం భూమి స్వాధీనానికి వీలు కల్పించే ముసాయిదా స్థానికుల ఆస్తిహక్కును హరిస్తుందని ఆందోళన వ్యక్తమవుతున్నది. పంచాయితీ రెగ్యులేషన్‌ ముసాయిదా-2021 ప్రకారం.. ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వారు పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఈ నిబంధన ఉద్దేశంపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూడా దీనిని వ్యతిరేకించాయి. కొత్తగా జనావాసాలున్న ద్వీపాల్లో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇదివరకు మద్యం అమ్మకాలపై నిషేధం ఉండేది.

- Advertisement -

యాంటీ-గూండా చట్టం
ప్రశాంతంగా ఉండే లక్షద్వీప్‌లో యాంటీ-గూండా చట్టం అమలుచేయడం వివాదాస్పదమైంది. దీని ద్వారా ఒక వ్యక్తిని కారణం చూపకుండానే ఏడాదిపాటు జైలులో ఉంచవచ్చు. కఠినమైన క్వారంటైన్‌ నిబంధనల కారణంగా లక్షద్వీప్‌లో ఏడాదిపాటు ఎలాంటి కేసులు నమోదుకాలేదు. అయితే గత డిసెంబర్‌లో నిబంధనలు సడలించడంతో కరోనా కేసులు పెరిగాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్ట్‌ ఉద్యోగులను ప్రఫుల్‌ తొలగించారు. సరుకు రవాణాకు స్థానికంగా ఉండే పోర్టును తప్పించి కర్ణాటకలోని మంగళూరు పోర్టు నుంచే కార్యకలాపాలు సాగించాలని ఆదేశించారు. మత్య్సకారులు తీరంలో ఏర్పాటు చేసుకునే షెడ్లు తీరప్రాంత భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయంటూ తొలగించారు.

ఎవరీ ప్రఫుల్‌ పటేల్‌?
గుజరాత్‌కు చెందిన ప్రఫుల్‌ పటేల్‌ ప్రధాని మోదీకి సన్నిహితుడు. 2007లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో అమిత్‌షా అరెస్టయినప్పుడు, ఆయన స్థానంలో మోదీ మంత్రివర్గంలో ప్రఫుల్‌కు చోటు లభించింది. మోదీ ప్రధాని అయిన తర్వాత 2016లో పటేల్‌ను డామన్‌ డయ్యూ, దాద్రానగర్‌ హవేలీ పాలనాధికారిగా నియమించారు. సాధారణంగా కేంద్రపాలిత ప్రాంతాలకు ఐఏఎస్‌లనే పాలనాధికారులుగా నియమిస్తారు. రాజకీయ నేతలను నియమించడం అరుదు. లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ మరణంతో డిసెంబర్‌లో ఈ దీవుల బాధ్యతను కూడా ప్రపుల్‌కు అదనంగా అప్పగించారు.

36 దీవుల సముదాయం
లక్షద్వీప్‌ 36 దీవుల సముదాయం. ఒక దీవి దాదాపు నీటమునిగి, నివాసయోగ్యం కాకుండాపోయింది. లక్షద్వీప్‌ మొత్తం 32 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కేరళకు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఈ దీవులు ఉన్నాయి. జనాభా దాదాపు 64 వేలు. మలయాళం, ఇంగ్లిష్‌ అధికారిక భాషలు. కాంగ్రెస్‌, ఎన్సీపీ ప్రధాన పార్టీలు. బీజేపీ, వామపక్షాల ఉనికి కూడా ఉన్నది. ఇక్కడ ఒక లోక్‌సభ స్థానం ఉన్నది. ప్రస్తుతం ఎన్సీపీకి చెందిన ఫైజల్‌ ఎంపీగా ఉన్నారు.

దర్శకురాలిపై దేశద్రోహం కేసు.. బీజేపీకి నేతల రాజీనామా
ప్రఫుల్‌ను విమర్శించిన దర్శకురాలు అయిషా సుల్తానాపై శుక్రవారం దేశద్రోహం కేసు నమోదుచేశారు. ప్రఫుల్‌ను జీవాయుధంగా ఆమె అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ఆమెపై లక్షద్వీప్‌ బీజేపీ అధ్యక్షుడు అబ్దుల్‌ ఖాదర్‌ హాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది బీజేపీలో విభేదాలకు దారితీసింది. అయిషా సుల్తానాకు మద్దతుగా 15 మంది బీజేపీ నేతలు, కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లక్షద్వీప్‌లో అలజడి
లక్షద్వీప్‌లో అలజడి
లక్షద్వీప్‌లో అలజడి

ట్రెండింగ్‌

Advertisement