మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 12, 2020 , 13:10:34

రసకందాయంలో రాజస్థాన్ రాజకీయం

రసకందాయంలో రాజస్థాన్ రాజకీయం

జైపూర్ : రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం తీవ్రతరం అవుతున్నది. రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ తిరుగుబాట్ల మధ్య రాజస్థాన్ నుంచి సుమారు 12 మంది ఎమ్మెల్యేలను హోటల్ కు తరలించారు. వీరిలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు ఇద్దరు స్వతంత్ర సభ్యులు ఉన్నారు.

మధ్యప్రదేశ్ మాదిరి రాజకీయం రాజస్థాన్ లో మొదలైంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై ఆగ్రహంతో ఉన్న యువ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్.. మధ్యప్రదేశ్ సింధియా రాజకీయాన్ని వంటబట్టించుకున్నట్టు కనిపిస్తున్నది.  పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని, ఏదో ఒకటి తేల్చుకునేందుకు ఈ యువ నేత సోనియాగాంధీతో అమీతుమీ తేల్చుకునేందుకు ఢిల్లీ పయనమై వెళ్లాడు. కాగా, శనివారం సాయంత్రం నాలుగు రైళ్లలో గురుగ్రామ్ లోని మనేసర్ సమీపంలో ఉన్న ఐటీసీ గ్రాండ్ భారత్ హోటల్ కు 12 ఎమ్మెల్యేలను తరలివచ్చారు. వీరిలో 10 మంది కాంగ్రెస్, ఇద్దరు ఇండిపెండెంట్లు ఎమ్మెల్యేలుగా చెప్తున్నారు. సచిన్ పైలట్ కు చెందిన వర్గంలోని 24 మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చారని కూడా కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఎమ్మెల్యేల్లో కొందరు సోనియా గాంధీని కలవడానికి ఆదివారం ఢిల్లీ వెళ్లవచ్చని వార్తలు కూడా ఉన్నాయి. 

అంతకుముందు జైపూర్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. మంత్రుల సమావేశాన్ని ఏర్పాటుచేయగా సచిన్ పైలట్ గైర్హాజరయ్యారు. తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని సచిన్ పైలట్ ఆగ్రహంతో ఉన్నాడని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేను 25-25 కోట్లకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా, కరోనా నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ విషయాలన్నిటి నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికే ఈ నాటకాలు ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా, ప్రతిపక్ష నాయకుడు గులాబ్ చంద్ కటారియా విమర్శించారు. ఇదిలాఉండగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలకు సంబంధించి ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌ఓజి) అశోక్ సింగ్, భారత్ మలానీ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రాజస్థాన్ అదనపు డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ రాథోడ్ తెలిపారు.

మధ్యప్రదేశ్ నుంచి చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మార్చిలో ఇక్కడే బస చేశారు. అనంతరం కమల్ నాథ్ ప్రభుత్వాన్ని మైనారిటీకి తీసుకురావడానికి స్క్రిప్ట్ ఈ హోటల్ నుంచే రచించడం కొసమెరుపు.


logo