శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 06, 2020 , 02:05:28

పోలీసులు విఫలమైతే.. ప్రజాస్వామ్యం విఫలమైనట్లే

పోలీసులు విఫలమైతే.. ప్రజాస్వామ్యం విఫలమైనట్లే
  • అజిత్‌ దోవల్‌

గుర్గావ్‌: చట్టం అమలు చేయడంలో పోలీసులు విఫలమైతే.. ప్రజాస్వామ్యం విఫలమైనట్లేనని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ తెలిపారు. పోలీసులు ప్రజల నమ్మకాన్ని చూరగొనాలన్నారు. బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (బీపీఆర్డీ) ఆధ్వర్యంలో గుర్గావ్‌లో గురువారం యువ సూపరింటెండెంట్స్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్పీల) సదస్సు జరిగింది. దేశవ్యాప్తంగా తరలివచ్చిన యువ పోలీసు అధికారులనుద్దేశించి అజిత్‌ దోవల్‌ మాట్లాడారు. ఈశాన్య ఢిల్లీలో ఇటీవల జరిగిన మత ఘర్షణలను నియంత్రించడంలో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమాజంలో పోలీసు పాత్ర గురించి దోవల్‌ ప్రధానంగా మాట్లాడారు. ‘ప్రజాస్వామ్యంలో చట్టాన్ని అమలు చేయడమన్నది పవిత్రమైన విధి. ఈ చట్టాలు రాజులు లేదా మత నాయకులు చేసినవి కావు. ప్రజాప్రతినిధులు చేసిన చట్టాలను మీరు అమలు చేయాలి. మీరు విఫలమైతే, ప్రజాస్వామ్యం విఫలమవుతుంది’ అని వ్యాఖ్యానించారు. ‘మన సమాజం చాలా ఏండ్లుగా బానిసత్వంలో ఉన్నది.  పోలీసులపై ప్రజల్లో ఉన్న భ్రమలు తొలిగిపోలేదు. తమ భద్రత, ఫిర్యాదులను పట్టించుకోరని పేద, అణగారిన ప్రజలు భావిస్తారు. పోలీసులు తమ పని తీరుతో ఆ ముద్రను తొలిగించేందుకు కృషి చేయాలి’ అని దోవల్‌ పిలుపునిచ్చారు. 


logo