శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 24, 2020 , 01:43:51

సీఏఏ నిరసనలు ఉద్రిక్తం

సీఏఏ నిరసనలు ఉద్రిక్తం
  • ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో రాళ్లు రువ్వుకున్న సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు
  • మూడ్రోజుల్లో సీఏఏ వ్యతిరేకులను ఖాళీ చేయించండి: పోలీసులకు కపిల్‌ మిశ్రా అల్టిమేటం
  • అలీగఢ్‌ సీఏఏ నిరసనల్లో కాల్పులు.. యువకుడికి గాయాలు
  • ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసుల బాష్పవాయు ప్రయోగం

న్యూఢిల్లీ/అలీగఢ్‌: దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా, అనుకూలంగా ఆదివారం జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈశాన్య ఢిల్లీలోని జఫ్రాబాద్‌ ప్రాంతానికి సమీపంలోని మౌజ్‌పూర్‌లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. దీంతో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాల్ని ప్రయోగించారు. ఉద్రిక్తతల నేపథ్యం లో మౌజ్‌పూర్‌-బాబర్‌పూర్‌ మెట్రోస్టేషన్‌ను అధికారులు మూసేశారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులకు బీజేపీ నేత కపిల్‌ మిశ్రా ట్విట్టర్‌లో ఓ అల్టిమేటాన్ని జారీ చేశారు. ‘సీఏఏకు వ్యతిరేకులను జఫ్రాబాద్‌ , చాంద్‌బాగ్‌ ప్రాంతాల నుంచి ఖాళీ చేయించడానికి మూడ్రోజుల సమయం ఇస్తున్నా. అమెరికా అధ్యక్షుడు భారత్‌లో ఉన్నన్ని రోజులు మేము ఆ ప్రాంతాల్ని విడిచిపెడుతాం. ఆ తర్వాత మీ(పోలీసులు) మాటల్ని వినం’ అని చెప్పారు. 

నిరసనల్లో కాల్పులు

సీఏఏకు వ్యతిరేకంగా అలీగఢ్‌లోని కొత్వాలీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం జరిగిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. నిరసన ప్రదర్శ నలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తారిఖ్‌ అనే యువకుడికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని సమీప దవాఖానకు తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఆదివారం అర్థరాత్రి వరకు నగరంలో ఇంటర్నెట్‌ సర్వీసులను రద్దు చేశారు.


logo