గురువారం 22 అక్టోబర్ 2020
National - Aug 12, 2020 , 01:04:27

మంటలు తీవ్రమయ్యాకే సమాచారం!

మంటలు తీవ్రమయ్యాకే సమాచారం!

స్వర్ణప్యాలెస్‌ ఘటనపై పోలీసుల విచారణ వేగిరం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ప్రమాద ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూశాయి. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం ఇవ్వలేదని విచారణ కమిటీలు నిర్ధారించాయి. మరోవైపు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, దవాఖాన యజమాని రమేశ్‌బాబు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. హోటల్లో ఎక్కువ భాగం కలపతో అలంకరించారు. మంటలు త్వరగా వ్యాప్తి చెందటానికి ఇదే ప్రధాన కారణమైంది. రిసెప్షన్‌ పక్కనే కంప్యూటర్లు, బ్యాటరీలు ఉన్నాయి. మొదట ఇక్కడి నుంచే మంటలు వ్యాప్తి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. ఇది మెట్ల మార్గానికి పక్కనే ఉండటంతో మొదటి అంతస్తులో దట్టంగా పొగ వ్యాపించి, దానిని పీల్చడంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు.  

నిందితులకు రిమాండ్‌

స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదం ఘటనలో అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు మంగళవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వైద్యశాల చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి డాక్టర్‌ కొడాలి రాజగోపాలరావు, స్వర్ణ ప్యాలెస్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఇంచార్జి, దవాఖాన జీఎం డాక్టర్‌ కే సుదర్శన్‌, కోఆర్డినేటింగ్‌ మేనేజర్‌ పల్లెపోతు వెంకటేశ్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించారు. నిందితులను మచిలీపట్నం స్పెషల్‌ సబ్‌ జైలుకు తరలించారు. 


logo