శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 19:42:57

హెల్మెట్‌ పెట్టుకోనందుకు నుదుటిపై తాళంతో గుచ్చాడు!

హెల్మెట్‌ పెట్టుకోనందుకు నుదుటిపై తాళంతో గుచ్చాడు!

న్యూ ఢిల్లీ: హెల్మెట్‌ ధరించకుంటే పోలీసులు ఏం చేస్తారు? ఫైన్‌ వేస్తారు.. కానీ ఉత్తరాఖండ్‌లో ఓ పోలీసు అమానవీయంగా ప్రవర్తించాడు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న ఓ యువకుడిని ఆపి బైక్‌ తాళంతో నుదిటిపై గుచ్చాడు. తాళం నుదుట్లో ఇరుక్కుపోగా, రక్తం కారుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 

ఉత్తరాఖండ్‌లోని ఉదమ్‌సింగ్‌నగర్‌ జిల్లాలోని రుద్రాపూర్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఓ యువకుడు తన స్నేహితుడితోపాటు మోటారు బైక్‌పై వెళ్తుండగా, పోలీసులు ఆపారు. హెల్మెట్‌ ఎందుకు ధరించలేదని అడగ్గా, సదరు యువకుడు వాగ్వాదానికి దిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన పోలీసు బైక్‌ తాళం తీసి, యువకుడి నుదుటిపై పొడిచాడు. ఈ సంఘటన జరిగినప్పుడు మరో ఇద్దరు పోలీసులు అక్కడే ఉన్నారు. 

నుదుటిలో బైక్‌ కీ ఇరుక్కొని, రక్తం కారుతున్న యువకుడిని గమనించినవారు ఏమైందని అడిగినా అతడు ఒక్క మాట కూడా చెప్పలేకపోయాడు. కొందరు ఈ దృశ్యాన్ని వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అనంతరం బాధితుడు తీవ్రగాయాలతో దవాఖానలో చేరాడు. విషయం తెలుసుకున్న ఉత్తరాఖండ్ పోలీసు ఉన్నతాధికారులు ఘటనకు బాధ్యుడైన పోలీసుతోపాటు ఇంతజరుగుతున్నా చూస్తూ ఉండిపోయిన మరో ఇద్దరిని సస్పెండ్‌ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.

విషయం తెలుసుకున్న బాధితుడి పక్షంవారు, స్థానికులు పెద్ద సంఖ్యలో పోలీస్‌ స్టేషన్‌కు తరలివచ్చి నిరసన తెలిపారు. పోలీసులపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఒక పోలీసు గాయపడ్డాడు. స్థానిక ఎమ్మెల్యే రాజ్‌కుమార్ తుక్రాల్ సంఘటన స్థలానికి చేరుకుని, సరైన న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు. దీంతో వారు శాంతించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo