శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 23, 2020 , 14:31:50

ప్ర‌ముఖ కవి, కార్యకర్త సుగతకుమారి కన్నుమూత‌

ప్ర‌ముఖ కవి, కార్యకర్త సుగతకుమారి కన్నుమూత‌

తిరువ‌నంత‌పురం : ప్రముఖ కవి, రచయిత, పర్యావరణవేత్త సుగతకుమారి(86) క‌న్నుమూశారు. కొవిడ్ -19 సంబంధిత సమస్యల కారణంగా తిరువ‌నంత‌పురం మెడిక‌ల్ కాలేజీ ఆస్ప‌త్రిలో బుధవారం ఉద‌యం 10.52 గంట‌ల‌కు ఆమె తుదిశ్వాస విడిచారు. ఈమె మృతిపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్, ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నితాలా, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ముల్లప్పల్లి రామచంద్రన్, కేంద్ర విదేశాంగ మంత్రి వి. మురళీధరన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్ సంతాపం తెలిపారు.

కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ సుగతకుమారిని 2006లో కేంద్ర ప్ర‌భుత్వం పద్మశ్రీతో సత్కరించింది. సాహిత్య అకాడమీ అవార్డు, కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, ఎజుతాచన్, ఒడకుజల్ సాహిత్య పురస్కారాలను అందుకున్నారు. ప‌ర్యావ‌ర‌ణ విధ్వంసానికి వ్య‌తిరేకంగా ఆమె అనేక ఆందోళ‌న‌ల‌కు నాయ‌క‌త్వం వ‌హించారు. తీర‌ప్రాంత ప‌ర్యావ‌ర‌ణ సంబంధిత కార్య‌క‌లాపాలు, సామాజిక చ‌ర్య‌ల‌పై ప్ర‌ధానంగా ఆమె త‌న నిర‌స‌న గ‌ళం వినిపించారు. 80వ ద‌శ‌కంలో సైలెంట్ వ్యాలీ జలవిద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జ‌రిగిన ఆందోళనప్పుడు సుగ‌త‌కుమారి పేరుగాంచారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ విషయంలో నేరుగా జోక్యం చేసుకోవడంతో ప్రభుత్వం స‌ద‌రు ప్రాజెక్టును రద్దు చేయాల్సి వచ్చింది.


logo