మంగళవారం 22 సెప్టెంబర్ 2020
National - Aug 04, 2020 , 13:43:18

రేపు అయోధ్య భూమిపూజ‌కు ప్ర‌ధాని.. షెడ్యూల్ ఇదే!

రేపు అయోధ్య భూమిపూజ‌కు ప్ర‌ధాని.. షెడ్యూల్ ఇదే!

ల‌క్నో: అయోధ్య‌లో రామమందిరం నిర్మాణం కోసం రేపు భూమిపూజ జ‌రుగ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీతోపాటు ప‌లువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రధాని బుధవారం ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక జెట్‌లో ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరతారు. 10.40కి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో బ‌య‌లుదేరి 11.30కి అయోధ్య‌కు చేరుకుంటారు. 11:40కి హ‌నుమాన్‌గ‌ర్హి ఆలయంలో పూజలు చేస్తారు. 10వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో ప్రధాని సంద‌ర్శ‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన పురోహితుడు మ‌హంతి రాజుదాస్ స‌హా ప‌లువురు అర్చ‌కులు దేశంలో క‌రోనా తొల‌గిపోవాలంటూ వేద‌మంత్రాలు చ‌దువ‌నున్నారు. 

మధ్యాహ్నం 12 గంటలకు రామజన్మభూమి ప్రాంతానికి ప్రధాని చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12:30 నుంచి 12:40 వరకు భూమి పూజ జరుగనుంది. మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుంది. 2:15 గంటలకు ప్ర‌ధాని తిరిగి ఢిల్లీకి వెళ్తారు. కాగా, భూమిపూజకు ఆహ్వానం అందిన‌వారే అయోధ్యకు రావాలని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్‌ విజ్ఞప్తి చేశారు. మొత్తం 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం పంపిన‌ట్లు ఆయ‌న తెలిపారు. భూమిపూజ కార్యక్రమంలో రెండు వేల ప్రాంతాల నుంచి సేక‌రించిన‌ పవిత్రమైన మట్టి, 100 నదుల నుంచి తెచ్చిన‌ నీరును వినియోగించనున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo