శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 31, 2020 , 10:20:41

సైనికుల త్యాగాలపై రాజకీయాలు చేయొద్దు : ప్రధాని

సైనికుల త్యాగాలపై రాజకీయాలు చేయొద్దు : ప్రధాని

గాంధీనగర్‌ : భారత తొలి ఉప ప్రధాని సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ 145 జయంతి ( ఏక్తా దివస్‌) సందర్భంగా ప్రధాని మోదీ గుజరాత్‌లోని నర్మదా నది తీరంలోని కేవాడియా వద్ద ఐక్యతకు చిహ్నంగా నిర్మించిన  సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ విగ్రహం  వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రీయ ఏక్తా దివస్‌ పరేడ్‌లో పాల్గొని జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సర్దార్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ఏక్తా దివస్‌ను జరుపుకుంటున్నామని గుర్తుచేశారు.

ఉగ్రవాదంపై భారత్‌ నిరంతర పోరు సాగిస్తుందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఏకమై పోరాడాలని  పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, హింసతో ఏ ఒక్కరూ ప్రయోజనం పొందలేరని పరోక్షంగా పాక్‌కు చురకలంటించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదని పేర్కొన్నారు. పుల్వామా దాడి సమయంలో కొందరు సైనికుల పక్షాన నిలవకపోవడం బాధించిందని, దేశ ప్రయోజనాల కోసం ఇలాంటి రాజకీయాలు మరోసారి చేయవద్దని ఆయన అభ్యర్థించారు.

ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌ అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని పునరుద్ధరించి, అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పర్యాటక రంగంలో అనేక కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయని,  దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకానికి కొత్త రూపు తీసుకొచ్చేందుకు కృషిచేస్తామని ఆయన పేర్కొన్నారు. దేశం కరోనాపై విజయసాధించేందుకు కృషిచేసిన పోలీసులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు తదితర కరోనా యోధులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.