బుధవారం 03 జూన్ 2020
National - Feb 07, 2020 , 01:24:10

దృష్టి మరల్చడంలో దిట్ట

దృష్టి మరల్చడంలో దిట్ట
  • అతిపెద్ద సమస్య అయిన నిరుద్యోగం గురించి మోదీ మాట్లాడరు
  • ప్రధానిపై రాహుల్‌ ధ్వజం
  • పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ గురించే మాట్లాడుతారు

న్యూఢిల్లీ, జనవరి 6: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న నిరుద్యోగం గురించి ప్రధాని మోదీ అస్సలు మాట్లాడరుగానీ జవహర్‌లాల్‌ నెహ్రూ గురించి, పాకిస్థాన్‌ గురించే ఆయన తరుచుగా మాట్లాడుతుంటారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. నిరుద్యోగ సమస్య నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడంలో మోదీ ైస్టెలే వేరని ధ్వజమెత్తారు. గురువారం పార్లమెంట్‌ బయట రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో సుదీర్ఘ ప్రసంగాలు చేసినా.. యువతకు ఉపాధి గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ‘పార్లమెంట్‌లో ప్రధాని మోదీ గంటన్నర మాట్లాడారు. కానీ యువత ఉపాధి గురించి కనీసం రెండు నిమిషాలైన మాట్లాడారా? దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం గురించి ఎందుకు మాట్లాడరు’ అని రాహుల్‌ నిలదీశారు.

  

ఆర్థిక వ్యవస్థకు కరోనా వైరస్‌

పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగం ఓ వైపు విదూషకుడిలా, మరోవైపు మతోన్మాదిలా ఉన్నదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనీశ్‌ తివారీ విమర్శించారు. చర్చతో ఎలాంటి సంబంధంలేకుండా జవహర్‌లాల్‌నెహ్రూ గురించి ప్రస్తావించినందుకు దేశ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిన ప్రధాని మోదీ దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల మధ్య విభజన తీసుకొస్తున్నారని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కరోనా వైరస్‌ సోకిందని, ఈ రోగాన్ని నయం చేయడానికి ప్రభుత్వం సాధారణ జలుబు మందు ఇస్తున్నదని ఎద్దేవా చేశారు. 
logo