శనివారం 04 జూలై 2020
National - Jul 01, 2020 , 02:24:39

కరోనాతో ఆటలొద్దు

కరోనాతో ఆటలొద్దు

  • అన్‌లాక్‌ 1తో ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగింది
  • నవంబర్‌ దాకా పేదలకు ఉచిత రేషన్‌: మోదీ
  • అన్‌లాక్‌ 1తో ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగింది
  • నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు
  • గ్రామ ప్రధానికీ దేశ ప్రధానికి ఒకటే రూల్‌
  • నవంబర్‌ వరకు పేదలకు ఉచిత రేషన్‌
  • పీఎంజీకేఏవై పథకం పొడిగింపు
  • జాతినుద్దేశించి ప్రసంగంలో మోదీ

న్యూఢిల్లీ, జూన్‌ 30: దేశంలో కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ మొదటి దశ సడలింపుల తర్వాత ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కరోనా వైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలోని 80కోట్ల మంది పేదలకు వచ్చే నవంబర్‌ చివరి వరకు ఉచిత రేషన్‌ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాన్‌ అన్నయోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని పొడిగిస్తున్నట్టు మంగళవారం దేశప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని తెలిపారు. 

అందరికీ ఒకటే రూల్‌

దేశంలో సరైన సమయంలో లాక్‌డౌన్‌ విధించటం వల్లనే ఎంతో మంది ప్రాణాలు కాపాడగలిగామని ప్రధాని అన్నారు. ఇప్పటికీ కరోనా కట్టడిలో ప్రపంచంలో చాలాదేశాలకంటే భారత్‌ మెరుగైన స్థితిలో ఉందని చెప్పారు. ‘ప్రజల ప్రవర్తనలో సామాజికంగా, వ్యక్తిగతంగా నిర్లక్ష్యం పెరిగిందని మా దృష్టికి వచ్చింది. చేతులు కడుక్కోవటం, శానిటైజర్లు వాడటం, మాస్కులు ధరించటం, భౌతికదూరం పాటించటం వంటివి గతంలో కచ్చితంగా పాటించారు. కానీ ఇప్పుడు వాటిని పాటించటంలేదు. ఇది చాలా తీవ్రమైన అంశం. మనం క్రమశిక్షణ కచ్చితంగా పాటించాలి. రూల్స్‌కు ఎవరూ అతీతం కాదు. గ్రామ ప్రధాని అయినా, దేశ ప్రధాని అయినా. మనం ఇప్పుడు అన్‌లాక్‌ 2 దశలోకి ప్రవేశించాం. అదే సమయంలో దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులు ఎక్కువగా వచ్చే సీజన్‌లోకి వచ్చాం. ప్రజలంతా దయచేసి జాగ్రత్తగా ఉండండి. నిర్లక్ష్యం పనికిరాదు’ అని సూచించారు. నిబంధనలు పాటించనివారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

ప్రజలను ఆదుకొనే శక్తి ఉంది

ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేశంలోని ప్రజలను ఆదుకొనే శక్తి ప్రభుత్వానికి ఉందని ప్రధాని స్పష్టంచేశారు. నవంబర్‌ వరకు అర్హులైన ప్రతి కుటుంబానికి 5 కిలోల బియ్యం లేదా గోధుమలు, ఒక కేజీ పప్పు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.90,000 కోట్లు ఖర్చు చేస్తుందని చెప్పారు. ‘అమెరికా జనాభాకంటే 2.5రెట్లు, బ్రిటన్‌కంటే 12రెట్లు, యూరోపియన్‌ యూనియన్‌ కంటే రెండింతల మందికి మా ప్రభుత్వం ఉచిత రేషన్‌ ఇస్తున్నది. ముందుముందు చాలా పండుగలు రానున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఉచిత రేషన్‌ కార్యక్రమాన్ని పొడిగించాం. దీపావళి, ఛాత్‌పండుగ దాకా ఉచిత రేషన్‌ ఇస్తాం’ అని ప్రధాని తెలిపారు. తన ప్రసంగాన్ని ఆరు ప్రాంతీయ భాషల్లోకి అనువదించిన వీడియోలను ఆయన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

మీవల్లనే దేశానికి ఆహారం 

గత కొన్ని నెలల్లోనే దేశంలోని రైతుల ఖాతాల్లో రూ.18000 కోట్లు జమచేశామని ప్రధాని తెలిపారు. వలస కార్మికుల కోసం గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకాన్ని కూడా ప్రారంభించామని గుర్తుచేశారు. ‘ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనే సామర్థ్యం రెండు వర్గాల ద్వారానే సాధ్యం. ఒకరు రైతులు. మరొకరు పన్ను చెల్లింపుదారులు.  దేశం నేడు ఆకలితో అలమటించకుండా ఉన్నది అంటే అందుకు కారణం మీరే. దేశ ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు.logo