శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 11, 2020 , 16:17:48

రేపు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా India-ASEAN 17వ స‌ద‌స్సు

రేపు వీడియో కాన్ఫ‌రెన్స్  ద్వారా India-ASEAN 17వ స‌ద‌స్సు

న్యూఢిల్లీ: ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ రేపు (న‌వంబ‌ర్ 12) India-ASEAN 17వ స‌ద‌స్సులో పాల్గొన‌నున్నారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఈ స‌మావేశం జ‌రుగ‌నుంది. ప్ర‌ధాని మోదీతోపాటు ఈ స‌మావేశానికి వియ‌త్నాం ప్ర‌ధాని ఎన్‌గుయెన్ వాన్‌ ఫుక్ కూడా స‌ద‌స్సుకు హాజ‌రుకానున్నారు. భార‌త్‌-10 దేశాల ఏషియ‌న్ గ్రూప్ మ‌ధ్య జ‌రిగే ఈ స‌మావేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా నెల‌కొన్న ఆర్థిక దుర‌వ‌స్థ నుంచి కోలుకోవ‌డం ఎలా..?, అందుకు భార‌త్‌-ఏసియ‌న్ దేశాలు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌లు, అనుస‌రించాల్సిన విధానాలు ఏమిటి..? త‌దిత‌ర అంశాల‌పై ఈ స‌మావేశంలో చ‌ర్చ‌జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ది.

అదేవిధంగా భార‌త్‌-ఏసియ‌న్ దేశాల మ‌ధ్య వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం ప్ర‌స్తుత స్థితి.. క‌నెక్టివిటీ, మారీటైమ్ కోఆప‌రేష‌న్‌, వాణిజ్యం, విద్య‌, సామ‌ర్థ్యాల పెంపు త‌దిత‌ర అంశాల్లో భాగ‌స్వామ్య దేశాలు సాధించిన ప్ర‌గ‌తిపై ఈ స‌మావేశంలో స‌మీక్షించ‌నున్నార‌ని భార‌త విదేశాంగ శాఖ ప్ర‌క‌టించింది.  ది అసోసియేష‌న్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియ‌న్ నేష‌న్స్ (ASEAN) అనేది సౌత్ ఈస్ట్ రీజియ‌న్‌లో ఒక ప్ర‌భావ‌వంత‌మైన గ్రూప్‌గా ఉన్న‌ది. భార‌త్‌తోపాటు అమెరికా, చైనా, జ‌పాన్‌, ఆస్ట్రేలియా ఈ గ్రూప్‌కు డైలాగ్ పార్ట్‌న‌ర్స్‌గా కొన‌సాగుతున్నాయి. 

కాగా, వివాదాస్ప‌ద‌ ద‌క్షిణచైనా స‌ముద్రంలో, తూర్పు ల‌ఢ‌క్‌లో చైనా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న స‌మ‌యంలో ఈ స‌ద‌స్సు జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం. ఏసియ‌న్ గ్రూప్‌లోని చాలా దేశాలకు ద‌క్షిణ చైనా స‌ముద్రం విష‌యంలో చైనాతో వివాదాలు ఉన్నాయి. ఏసియ‌న్ గ్రూప్‌లో ఇండోనేషియా, మ‌లేషియా, ఫిలిప్పీన్స్‌, సింగ‌పూర్‌, థాయ్‌లాండ్‌, బ్రూనై, వియ‌త్నాం, లావోస్‌, మ‌య‌న్మార్‌, కాంబోడియా దేశాలు ఉన్నాయి.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.