శనివారం 30 మే 2020
National - May 18, 2020 , 12:48:00

అతి తీవ్ర తుపానుగా ఉమ్‌ పున్‌.. ప్రధాని మోదీ సమీక్ష

అతి తీవ్ర తుపానుగా ఉమ్‌ పున్‌.. ప్రధాని మోదీ సమీక్ష

న్యూఢిల్లీ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపాన్‌ ఉమ్‌ పున్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం పారాదీప్‌కు దక్షిణంగా 780 కిలోమీటర్ల దూరంలో ఉమ్‌ పున్‌ కేంద్రీకృతమైంది. బెంగాల్‌లోని దిఘాకు 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తర ఈశాన్య దిశగా 8 కిలోమీటర్ల వేగంతో ఉమ్‌ పున్‌ కదులుతోంది. ఈ క్రమంలో ఉమ్‌ పున్‌ మరింత బలపడి పెను తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 20వ తేదీన సాయంత్రం తుపాను తీరం దాటే అవకాశం ఉంది. బెంగాల్‌ - బంగ్లాదేశ్‌ మధ్య హతియా దీవుల వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే వేళ గాలుల వేగం గంటకు 185 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేసింది వాతావరణ శాఖ. తుపాను ప్రభావంతో ఒడిశా, బెంగాల్‌, సిక్కింలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష

ఉమ్‌ పున్‌ మరింత బలపడి పెను తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసిన క్రమంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. హోంశాఖ, ఎన్‌డీఎంఏ అధికారులతో మోదీ సమీక్షించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మోదీ చర్చించనున్నారు. 


logo