శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 12:34:33

కార్గిల్‌ యుద్ధ‌ వీరులకు వందనం : మోదీ

కార్గిల్‌ యుద్ధ‌ వీరులకు వందనం : మోదీ

  • సైనికుల త్యాగాలను ఎప్పటికీ ఈ దేశం మరవదు
  • కార్గిల్‌ స్ఫూర్తితో కరోనాపై పోరాడుదాం

న్యూఢిల్లీ : కార్గిల్‌ యుద్ధంలో అమరులైన వీర సైనికులకు, వారికి జన్మనిచ్చిన తల్లులకు దేశ ప్రజలందరి తరపున వందనం సమర్పిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ప్రజలను ఉద్దేశించి మన్‌ కీ బాత్‌లో ప్రసంగించిన మోదీ.. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా సైనికుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. కార్గిల్‌ యుద్ధంలో భారత సైనికులు చూపిన పరాక్రమాన్ని యావత్‌ ప్రపంచ చూసింది. ఆ యుద్ధంలో సైనికులు చూపి త్యాగం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశాన్ని స్థిరంగా రక్షించిన సాయుధ దళాల ధైర్యం, సంకల్పం మరువలేము. సైనికుల శౌర్యం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. దేశ సమగ్రతకు సైనికులు చూపే ధైర్య సాహసాలకు వందనం. సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరవదు. జవాన్ల ధైర్య సాహసాలకు దేశం కృతజ్ఞతలు తెలుపుతోంది. 21 సంవత్సరాల క్రితం ఇదే రోజు మన సైన్యం కార్గిల్‌ యుద్ధంలో గెలిచింది అని మోదీ గుర్తు చేశారు. సైనికుల త్యాగాలను యువత విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. సైనికుల సంక్షేమం కోసం ఏదైనా చేయాలని మోదీ అన్నారు.

భారత్‌ ఎప్పుడూ స్నేహపూర్వక సంబంధాల కోసమే ప్రయత్నిస్తోంది. అంతర్గత సంఘర్షణల నుంచి దృష్టి మరల్చేందుకు ఆనాడు పాక్‌ దురాలోచన చేసింది. కుట్రపూరితంగా భారతదేశ భూభాగాన్ని ఆక్రమించాలనే దుస్సాహసం పాకిస్తాన్‌ చేసిందని మోదీ తెలిపారు. తమకు మేలు చేసే వారికి కూడా అకారణంగా కీడు చేసేందుకు ఆలోచిస్తూ ఉండడమే దుష్టుల స్వభావమని ప్రధాని పేర్కొన్నారు.  

కార్గిల్‌ స్ఫూర్తితో కరోనాపై పోరాడుదాం

కార్గిల్‌ స్ఫూర్తితో కరోనాపై పోరాడుదామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని ఆయన హెచ్చరించారు. కరోనా వైరస్‌పై పోరాటానికి మరింత సమర్థత అవసరం. కేంద్ర, రాష్ర్టాల సమన్వయంతో కరోనాను తరిమిగొడదాం. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి. మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలి. కరోనా రికవరీ రేటులో ఇతర దేశాల కంటే చాలా మెరుగ్గా ఉన్నామని మోదీ తెలిపారు. 


logo