సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 09, 2020 , 01:28:31

మహిళా శక్తికి నమో!

మహిళా శక్తికి నమో!
  • ఏడుగురు ‘నారీ శక్తి’ గ్రహీతల చేతికి మోదీ సోషల్‌ మీడియా ఖాతాలు
  • ఒక రోజంతా వారే నిర్వహణ.. ‘షీ ఇన్‌స్పైర్స్‌ అజ్‌' హ్యాష్‌ట్యాగ్‌తో వారి విజయాల ప్రస్తావన

న్యూఢిల్లీ, మార్చి 8: ప్రధాని మోదీ సోషల్‌ మీడియా ఖాతాల నిర్వహణ ‘నారీ శక్తి’ చేతికి చేరింది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక రోజంతా తన ఖాతాలను మహిళలకు అప్పగిస్తానని ప్రధాని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన  ‘నారీ శక్తి’ పురస్కారాలు అందుకున్నవారిలో ఏడుగురిని ఆదివారం ఎంపికచేశారు. రోజంతా తన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల నిర్వహణ బాధ్యత వారికే అప్పగిస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. తాను ‘సైనింగ్‌ ఆఫ్‌' చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం ఆ ఏడుగురు.. తమ అభిప్రాయాలను, అనుభవాలను మోదీ ఖాతాల ద్వారా పంచుకున్నారు. ‘షీ ఇన్‌స్పైర్స్‌ అజ్‌' (#SheInspiresUs) హ్యాష్‌ ట్యాగ్‌ను జత చేశారు.   


పోషకాహార లోపం నిర్మూలనకు పాటుపడండి

దేశంలో పోషకాహార లోపాన్ని నిర్మూలించేందుకు, నీటి సంరక్షణకు పాటుపడాలని నారీ శక్తి పురస్కార గ్రహీతలను ప్రధాని మోదీ కోరారు. ఆదివారం ఢిల్లీలోని తన నివాసంలో   ప్రధాని వారితో ముచ్చటించారు. వారు సాధించిన ఘనతలు విశ్వవిద్యాలయాలకు కేస్‌ స్టడీలుగా మారుతాయని చెప్పారు.   


స్నేహ మోహన్‌దాస్‌: అన్నార్థుల పాలిట అన్నపూర్ణ. తన తల్లి స్ఫూర్తిగా ‘ఫుడ్‌ బ్యాంక్‌ ఇండియా’ను ప్రారంభించారు. తమకు 20కి పైగా శాఖలున్నాయని, సామూహిక వంటలు (మాస్‌ కుకింగ్‌), కుకింగ్‌ మారథాన్‌, తల్లిపాలపై అవగాహన సదస్సులు నిర్వహించామని మోదీ ట్విట్టర్‌ ఖాతాలో స్నేహ పోస్ట్‌ చేశారు. 


మాళవిక అయ్యర్‌: 13 ఏండ్ల వయసులో బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడ్డారు. ఆమె రెండు చేతులు తెగిపోయాయి. ‘ఓటమిని అంగీకరించొద్దు. మీ హద్దులను చెరిపేయండి. ధైర్యం, నమ్మకంతో ప్రపంచాన్ని ఎదుర్కోండి’ అని ఆమె పేర్కొన్నారు.

ఆరిఫా జైన్‌: కశ్మీర్‌కు చెందిన ఆరిఫా.. ఆ రాష్ట్ర సంప్రదాయ చేనేత ఉత్పత్తులకు, ఆధునికతను జోడించి ‘నమ్దా’ పేరుతో మార్కెట్‌ చేస్తున్నారు. స్థానిక మహిళల సాధికారతే లక్ష్యంగా కృషిచేస్తున్నారు. ‘మహిళా కళాకారుల దుస్థితిని కండ్లారా చూశా. వారి బతుకులు బాగుచేసేందుకు యత్నిస్తున్నా’ అని పేర్కొన్నారు. 


కల్పనా రమేశ్‌: ఈమె జల సంరక్షణ ఉద్యమకారిణి. ‘మీకు నచ్చిన అంశంలో.. భిన్నమార్గంలో పోరాడండి. అందరూ జల సంరక్షణలో భాగం కండి. నీటి పునర్వినియోగంపై అవగాహన పెంచుకోండి’ అని కల్పన కోరారు.

విజయ పవార్‌: మహారాష్ట్రలోని బంజారాలకు చెందిన సంప్రదాయ వస్ర్తాలకు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చారు విజయ పవార్‌.  ‘రెండు దశాబ్దాలుగా ఇదే పని చేస్తున్నా. నాతోపాటు ఇప్పుడు మరో వెయ్యి మంది మహిళలు కలిసి పనిచేస్తున్నారు’ అని చెప్పారు. 


కళావతి దేవి: కాన్పూర్‌కు చెందిన కళావతి.. నిధులు సేకరించి పరిసర గ్రామాల్లో నాలుగు వేలకుపైగా మరుగుదొడ్లను నిర్మించారు. ‘మా ప్రాంతం రోత పుట్టించేదిగా ఉండేది. పరిశుభ్రతతో ఈ పరిస్థితిని మార్చొచ్చని నమ్మా. డబ్బు పోగేసి టాయిలెట్లు కట్టించాను’ అని చెప్పారు. 


బీణాదేవి: సంకల్ప బలానికి బీణాదేవి ప్రత్యక్ష ఉదాహరణ. ఆమె స్వస్థలం బీహార్‌లోని మున్గర్‌. పుట్టగొడుగుల పెంపకంలో వినూ త్నమైన పద్ధతులను ఆవిష్కరించి, 1500 మంది మహిళలకు ఉపాధి కల్పించారు. గ్రామీణ మహిళలకు డిజిటల్‌ ఉపకరణాలపై అవగాహన పెంచారు. గ్రామ సర్పంచిగా అభివృద్ధి పనులు చేపట్టారు.


ప్రశంసలు.. విమర్శలు 

ప్రధాని తన సోషల్‌ మీడియా ఖాతాలను మహిళలకు అప్పగించడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. హక్కుల కార్యకర్త మోనికా అరోరా స్పందిస్తూ.. ‘మానవత్వానికి సేవచేస్తున్న నిజమైన మహిళలకు దక్కిన గౌరవమిది’ అని కొనియాడారు. మరోవైపు.. ఇది దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చే కార్యక్రమమని సీపీఐ నేత అన్నె రాజా విమర్శించారు. పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా స్పందిస్తూ.. మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్టు ఆడుతున్న నాటకాల్ని ఇకనైనా విడిచిపెట్టాలని కేంద్రానికి సూచించారు. కశ్మీర్‌ తొలి మహిళా సీఎంని చట్టవిరుద్ధంగా జైలులో పెట్టారన్నారు.logo