బుధవారం 23 సెప్టెంబర్ 2020
National - Aug 06, 2020 , 03:56:41

జగమంతా రామమయం

జగమంతా రామమయం

  • అయోధ్యలో ఆలయానికి భూమిపూజ
  • జగదభిరాముడి దివ్యమందిరానికి అంకురార్పణ 
  • వేదమంత్రాల మధ్య వెండి ఇటుకలతో భూమిపూజ 
  • ప్రధాని మోదీ చేతులమీదుగా శాస్ర్తోక్తంగా నిర్వహణ 
  • శతాబ్దాల ఎదురుచూపులకు తెరపడిందన్న మోదీ 
  • పాల్గొన్న రాజకీయ, మత ప్రముఖులు
  • మూడేండ్లలో నిర్మాణం పూర్తయ్యే అవకాశం
  • అయోధ్యలో వైభవంగా భూమిపూజ కార్యక్రమం
  • కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరిమితంగా ప్రముఖుల హాజరు
  • రామనామస్మరణతో మార్మోగిన అయోధ్య.. పులకించిన భక్తకోటి

జగదభిరాముడు ఆ శ్రీరామ చంద్రమూర్తి జన్మస్థలమైన అయోధ్యాపురిలో రామ మందిరం నిర్మించాలనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల చిరకాల కోరిక. ఐదు శతాబ్దాల నుంచి ఎన్నో అవరోధాలు దాటుకొని బుధవారం ఎట్టకేలకు కోవెల నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్ర్తోక్తంగా జరిగిన ఈ మహా క్రతువును టీవీలు, ఆన్‌లైన్‌ మాధ్యమాల ద్వారా తిలకించిన యావత్‌ ప్రజానీకం భక్తిపారవశ్యంతో పులకితులయ్యారు. 

అయోధ్య (యూపీ), ఆగస్టు 5: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ ధామానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. బుధవారం మోదీ చేతుల      మీదుగా రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఆగమ శాస్త్ర పండితులు ప్రధాని చేతుల మీదుగా ఈ క్రతువు జరిపించారు. ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌, శ్రీరామ్‌ జన్మభూమి తీర్ధ్‌ క్షేత్ర ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌ దాస్‌తోపాటు 1980 దశకంలో రామ మందిర నిర్మాణం కోసం ఉద్యమించిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో 175 మంది ప్రముఖులు మాత్రమే ఈ క్రతువుకు హాజరయ్యారు. 


కొవిడ్‌ నిబంధనల నడుమ వేడుక

ఎరుపు, పసుపు రంగుల టెంట్లు, బంతి పూలతో భూమి పూజ జరిగే ప్రాంగణాన్ని నిర్వాహకులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేద పండితుల సంస్కృత శ్లోకాలతో పూజా కార్యక్రమం జరుగుతున్నంతసేపూ ప్రధాని మోదీతో పాటు కార్యక్రమానికి హాజరైన వారందరూ ముఖానికి మాస్కులను ధరించి భౌతిక దూరం వంటి కొవిడ్‌ నియమాలను పాటిస్తూ దూరం దూరంగా కూర్చున్నారు. ఆగమ శాస్త్ర పండితుల సూచనలతో మోదీ భూమి పూజ కార్యక్రమాన్ని జరిపారు. పూజ ముగింపు అనంతరం ‘భారత్‌ మాతాకీ జై’, ‘హర్‌ హర్‌ మహాదేవ్‌' వంటి నినాదాలతో ప్రాంగణమంతా మార్మోగిపోయింది. అనంతరం భగవాన్‌ శ్రీ రామ్‌లల్లా విరాజ్‌మాన్‌ దగ్గర మోదీ పూజలు చేశారు. ఆ తర్వాత ప్రాంగణం ఆవరణలో పారిజాతం మొక్కను నాటారు. భూమిపూజకు సంబంధించి శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని.. ‘శ్రీరామ్‌ జన్మభూమి మందిర్‌' పేరిట స్మారక పోస్టేజ్‌ స్టాంపును విడుదల చేశారు. అంతకుముందు భూమి పూజ కార్యక్రమం నేపథ్యంలో అయోధ్య నగరమంతటా ప్రధాన వీధుల్లో బంతిపూల తోరణాలతో అలంకరించారు. పసుపు, కాషాయం రంగు జెండాలను కట్టారు. ఆలయానికి వెళ్లే దారుల్లో భారీ హోర్డింగులను ఏర్పాటు చేశారు. నగరంలోని వ్యాపార సముదాయాలన్నీ దాదాపు పసుపు రంగు పెయింటింగుతో మెరిసిపోయాయి. క్రతువు జరుగుతున్న సమయంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో భజన కార్యక్రమాలు, శ్లోకాలను పఠించారు. 

హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు

భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధాని మోదీ అయోధ్యకు హెలికాప్టర్‌లో వచ్చారు. ఆయనకు ఉత్తరప్రదేశ్‌ సీఎం ఆదిత్యనాథ్‌ సహా పలువురు స్వాగతం పలికారు. భూమి పూజ వేదికకు వెళ్లేకంటే ముందు మోదీ నగరంలోని హనుమాన్‌గఢీ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసిడి రంగులో ఉన్న సాంప్రదాయ కుర్తా, తెల్లరంగు ధోవతితో విచ్చేసిన మోదీకి మందిరం ప్రధాన అర్చకుడు తలపాగా బహూకరించారు. భూమి పూజ కంటే ముందు ఆంజనేయుడి ఆలయంలో ప్రధాని పూజలు నిర్వహించడానికి గల కారణాన్ని హనుమాన్‌ గఢీ మహంత్‌ రాజు దాస్‌ వివరించారు. ‘ఆ హనుమంతుడి ఆశీర్వాదం లేకుండా ఏ పని కూడాదిగ్విజయంగా పూర్తి కాదు. ఈ గుడిలో కొలువుదీరిన హనుమంతుడిని దర్శించుకోవాలంటే 76 మెట్లు ఎక్కి రావాలి. ఉత్తర భారతదేశంలో ఈ ఆలయానికి ఎంతో ప్రశస్తి ఉన్నది. లంకలో రావణ సంహారం తర్వాత అయోధ్యకు వచ్చిన రాముడు ఈ ప్రాంతాన్ని హనుమంతుడికి ఇచ్చి ఇక్కడే నివసించమని చెప్పాడు. అందుకే దీన్ని హనుమాన్‌ గఢీ లేదా హనుమాన్‌ కోట్‌ అంటారు. ఆలయంలో తన తల్లి అంజని ఒడిలో కూర్చున్న బాల హనుమంతుడిని దర్శించుకునేందుకు వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు వస్తారు’ అని చెప్పారు.

పులకించిన అయోధ్య

భూమిపూజ సందర్భంగా అయోధ్యాపురి శ్రీరాముడి పాలన కాలాన్ని తలపించింది. నాటి పురాణ కాలంలో ఏ వీధిలో చూసినా రామ లీలలు హరికథలు, బుర్రకథలుగా చెప్పుకొనేవారని భక్తుల విశ్వాసం. బుధవారం కూడా వీధివీధినా భజనలు, దీపారాధనలు, కీర్తనలు హోరెత్తాయి. భూమిపూజ ప్రదేశానికి సామాన్యులకు అనుమతి లేకపోవటంతో అనేక షాపుల ముందు టీవీ తెరలు ఏర్పాటుచేసి ప్రత్యక్ష ప్రసారాలు చేశారు. శ్రీగార్‌హాట్‌ ప్రాంతంలోని నగల దుకాణాల యజమానులు సొంతంగా ఏర్పాటుచేసిన టీవీల ముందు సాధారణ పౌరులతోపాటు పోలీసులు, మీడియా సిబ్బంది కూడా గుమికూడి వేడుకను తిలకించటం కనిపించింది.

దేశమంతా రోమాంచితం.. రామ భక్తులంతా రామాంకితం. 

కన్యాకుమారి నుంచి కాశ్మీరం దాకా, ద్వారక నుంచి కామాఖ్యదాకా పెల్లుబికిన భావోద్వేగం. తమ స్వామి.. మర్యాదాపురుషోత్తముడైన రామచంద్రుడి జన్మభూమి అయోధ్యలో అపూర్వ ధామానికి శ్రీకారం చుడుతున్న శుభతరుణంలో జగత్తు నిండా రామనామ కీర్తనలు వెదజల్లిన భక్తి పారవశ్య పరిమళాలు.. బాలరాముడి దివ్య మందిర నిర్మాణం కోసం ఏండ్ల తరబడి కన్న కలలు సాకారమైన వేళ పవిత్ర అయోధ్యాపురి  పులకించిపోయింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రధానమంత్రి  నరేంద్రమోదీ భవ్య రామాలయానికి వెండి ఇటుకలతో భూమిపూజ చేశారు. విశ్వవ్యాప్తంగా రామభక్తులంతా కండ్లింతలు చేసుకొని ఈ అద్భుత సమారోహాన్ని తిలకించారు.  


ఈ ఆలయం కోసం ఎంతోమంది అనేక త్యాగాలు చేశారు.వారందరికీ చేతులెత్తి మొక్కుతున్నా. రాముడు సర్వాంతర్యామి. రాముడు అందరివాడు. ఈ ఆలయం భారతీయ సుసంపన్న సంస్కృతికి, మానవతకు చిహ్నంగా నిలుస్తుంది.

-   ప్రధాని నరేంద్రమోదీlogo