శనివారం 04 జూలై 2020
National - Jun 22, 2020 , 10:27:09

ప్రధాని మోదీ వ్యాఖ్యలను తప్పుపట్టిన మాజీ ప్రధాని మన్మోహన్‌

ప్రధాని మోదీ వ్యాఖ్యలను తప్పుపట్టిన మాజీ ప్రధాని మన్మోహన్‌

హైదరాబాద్‌: గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షణపై ప్రధాని మోదీ చేసిన ప్రకటనను మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తప్పుపట్టారు.  అఖిల పక్ష సమావేశంలో మోదీ పేర్కొన్న మాటలను ఉద్దేశిస్తూ.. ఇవాళ మన్మోహన్‌ ఓ ప్రకటన చేశారు. కీలక స్థానంలో ఉన్న ప్రధాని మోదీ తప్పుడు సమాచారం ఇవ్వడం సరికాదన్నారు.  గాల్వన్‌ లోయలో మృతిచెందిన కల్నల్‌ సంతోష్‌బాబుతో పాటు ఇతర సైనిక కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు.  సమర్థవంతమైన నాయకత్వానికి, దౌత్యానికి తప్పుడు సమాచారం పనికి రాదు అన్నారు.  

ప్రస్తుతం తరుణంలో సంక్లిష్టమైన స్థానంలో ఉన్నామని, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు.. భవిష్యత్‌ తరాలపై తీవ్ర  ప్రభావం చూపనున్నాయని, మనల్ని ముందుకు తీసుకువెళ్లేవాళ్లు బాధ్యతతో ఉండాలని, మన ప్రజాస్వామ్యంలో బాధ్యతలన్నీ ప్రధానిపైనే ఉంటాయని, ప్రధాని తాను మాట్లాడే మాటల పర్యవసానాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, జాతీయ భద్రత, దేశ సరిహద్దుల విషయంలో చాలా స్పష్టంగా ప్రధాని మాట్లాడాల్సి ఉంటుందని మాజీ ప్రధాని మన్మోహన్‌ అన్నారు. మన భూభాగంలోకి ఎవరూ రాలేదు అని, మన పోస్టులను ఎవరూ ఆక్రమించలేదని అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ వెల్లడించారు. దీన్ని కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది.  భారత భూభాగాన్ని చైనాకు అప్పగించారా అని రాహుల్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో వివాదం ముదిరింది.  కాంగ్రెస్‌ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. 

గాల్వన్‌ లోయతో పాటు పాంగ్‌గాంగ్‌  సరస్సు ప్రాంతంలో చైనా మన భూభాగాన్ని ఆక్రమించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నదని, ఏప్రిల్‌ నెల నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లు మన్మోహన్‌ ఆరోపించారు. మన భూభాగం విషయంలో ఎటువంటి బెదిరింపులకు లొంగిపోవద్దు అని, ప్రధాని తన మాటాలతో అవతలవారికి స్వేచ్ఛ ఇవ్వవొద్దు అని, ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ సంస్థలతో కలిపి పనిచేయాలని మన్మోహన్‌ అన్నారు.  ఇలాంటి సందర్భంలోనే మనం అంతా ఒక్కటిగా నిలబడాలని, తప్పుడు సమాచారంతో దౌత్యాన్ని చేయలేమన్నారు.logo