గురువారం 02 జూలై 2020
National - Jun 05, 2020 , 15:13:57

మోదీ వ్యక్తిగత కార్యదర్శికి వరల్డ్‌ బ్యాంకులో కీలక పదవి

మోదీ వ్యక్తిగత కార్యదర్శికి వరల్డ్‌ బ్యాంకులో కీలక పదవి

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ వ్యక్తిగత కార్యదర్శి, గుజరాత్‌ క్యాడర్‌కు చెందిన 1996 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ టాప్నో ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఈడీ)కి సీనియర్‌ సలహాదారుడిగా నియమితులయ్యారు. ప్రధాని కార్యాలయంలో పనిచేస్తున్న బజేంద్ర నవనీత్‌ ప్రపంచ వ్యాపార సంస్థ (డబ్ల్యూటీవో) అంబాసిడర్‌, భారత శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యారు. ఆయన తమిళనాడు క్యాడర్‌కు చెందిన 1999 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రవి కోటా వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఎకనామిక్‌ మినిస్టర్‌ (అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యాధికారి)గా నియమితులయ్యారు. అసోం మేఘాలయ క్యాడర్‌ 1993 బ్యాచ్‌కు చెందిన ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు.

సెంట్రల్‌ సెక్రటేరియట్‌ సర్వీసెస్‌ (సీఎస్‌ఎస్‌) అధికారి లేఖన్‌ థక్కర్‌, చైనాలోని బీజింగ్‌లో భారత రాయబార కార్యాలయంలోని దౌత్య ఆర్థిక కౌన్సిలర్‌గా నియమితులయ్యారు. ఇండియన్ సివిల్‌ అకౌంట్స్‌ సర్వీసెస్‌ (ఐసీఏఎస్‌)కు చెందిన 2000 బ్యాచ్‌ అధికారి హెచ్‌ అతేలి మనీలాలోని ఆసియా అభివృద్ధి బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌కు సలహాదారుడిగా వ్యవహరించనున్నారు. ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌ సర్వీస్‌ 2000 బ్యాచ్‌కు చెందిన అన్వర్‌ హుస్సేన్‌ షేక్‌ ప్రపంచ వ్యాపార సంస్థలో భారత్‌ శాశ్వత కౌన్సిలర్‌గా నియమితులయ్యారు. మణిపూర్‌ క్యాడర్‌ 2004 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ఎన్‌ అశోక్‌ కుమార్‌ బ్రస్సెల్స్‌లోని భారత రాయబార కార్యాలయంలో పరిశ్రమలు, ఇంజినీరింగ్‌ సలహాదారుడిగా వ్యవహరించనున్నారు. వీరంతా మూడేండ్లపాటు ఆయా పదవుల్లో బాధ్యతలు నిర్వహిస్తారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. logo