‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్’లో భారత్‌కు 139వ స్థానం
న్యూయార్క్: ‘సంతోషం సగం బలం’ అనే సామెత మనకు ఉందిగానీ.. సంతోషం మాత్రం లేదు. భారతీయులు అస్సలు హ్యాపీగా లేరని ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేసే స్థిరాభివృద్ధి పరిష్కార సమాఖ్య ‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2021’ పేరిట ఈ నివేదికను విడుదల చేసింది. 149 దేశాలపై నిర్వహించిన ఈ అధ్యయనంలో భారత్ 139వ స్థానంలో నిలిచింది. జీవన శైలి-పరిణామాలు, సామాజిక మద్దతు, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి స్థాయి, దేశ జీడీపీ తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను రూపొందించారు. ఐరోపా దేశం ఫిన్లాండ్ ఈ జాబితాలో నెంబర్‌వన్‌గా నిలిచింది. గత మూడేండ్లుగా హ్యాపీనెస్ జాబితాలో ఈ దేశం తొలిస్థానంలో నిలుస్తుండటం విశేషం. డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నెదర్లాండ్స్ వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. అగ్రరాజ్యం అమెరికా 19వ స్థానంలో, బాంబులతో దద్దరిల్లే దేశాల్లో ఒకటైన ఆప్ఘనిస్థాన్ చివరి స్థానంలో నిలిచాయి.