సోమవారం 06 జూలై 2020
National - May 30, 2020 , 08:20:28

జాతినుద్దేశించి ప్రధాని లేఖ... వలస దుస్థితిపై తీవ్ర ఆవేదన

జాతినుద్దేశించి ప్రధాని లేఖ... వలస దుస్థితిపై తీవ్ర ఆవేదన

ఢిల్లీ : ఎన్డీయే-2 ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతినుద్దేశించి లేఖ రాశారు. ప్రజల ఆదరాభిమానాలతో ఏడాది పాలన పూర్తిచేసుకున్నామన్నారు. గతేడాది ఇదే రోజు భారత ప్రజాస్వామ్యంలో సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. అనేక దశాబ్దాల తర్వాత దేశం పూర్తి మెజారిటీతో పూర్తికాల ప్రభుత్వానికి ఓటేసింది. భారతదేశం ప్రాముఖ్యత రోజురోజుకి పెరుగుతుంది. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పేదల గౌరవం ఇనుమడిస్తుందన్నారు. తన ప్రభుత్వ నిర్ణయాల ఫలితంగా గ్రామీణ-పట్టణాల మధ్య అంతరాలు తగ్గిపోతున్నాయన్నారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. సవాళ్లను ఎదుర్కోవడంలో తమ ప్రభుత్వం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం గడిచిన ఏడాదిలో ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకుందన్నారు. అదేవిధంగా దేశం వేగంగా అభివృద్ధి సాధించిందన్నారు.

అయితే కరోనా వైరస్‌ కారణంగా వలస కార్మికులు, కూలీలు, ఇతరులు విపరీతమైన బాధలు అనుభవించారన్నారు. ఈ సంక్షోభంలో ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగలేదని తాము చెప్పడం లేదన్నారు. కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో వేల సంఖ్యలో వలస కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. స్వస్థలాలకు చేరుకునేందుకు నడక, సైకిళ్లు, ట్రక్కులను ఆశ్రయిస్తున్నారు. మన కూలీలు, వలస కార్మికులు, చిన్న తరహా పరిశ్రమలు, చేతివృత్తులవారు, హస్త కళాకారులు, హాకర్లు ఈ సంక్షోభ సమయంలో తీవ్ర బాధలు అనుభవించారన్నారు. అయినప్పటికి ఈ బాధలు, ఇబ్బందులు, అసౌకర్యాలు విపత్తులుగా మారకుండా చూసుకుందామన్నారు.  

కరోనా భారతదేశాన్ని తాకినప్పుడు భారత్‌ ప్రపంచానికి సమస్యగా మారుతుందని చాలా మంది భయపడ్డారు. కానీ నేడు మనం తీసుకున్న చర్యలతో ప్రపంచమే మన వైపు చూస్తుందన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్‌ ప్రపంచాన్ని ఆశ్యర్యపరుస్తుందన్నారు. భారతీయుల సమిష్టి బలం, సామర్థ్యంతో ఇది నిరూపితమైందన్నారు. ఇందుకు మీరే కారకులన్నారు. ప్రపంచంలోని శక్తివంతమైన, సంపన్న దేశాలతో పోల్చితే ఇది అసమానం అన్నారు. చప్పట్లు చరవడం గానీ, దీపాలు వెలిగించడం గానీ, కరోనా యోధులను ఆర్మీ గౌరవించడం గానీ, జనతా కర్ఫ్యూ గానీ, దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నియమాలను కచ్చితంగా పాటించడం ఇలా ప్రతి సందర్భంలోనూ ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌ అని నిరూపించారని ప్రధాని పేర్కొన్నారు.

మన దేశం ఎన్నో సవాళ్లు, సమస్యలను ఎదుర్కొంటుందని ప్రధాని తెలిపారు. వీటిని ఎదుర్కొనేందుకు రాత్రనక, పగలనక తాను పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉందని తనకు తెలుసన్నారు. తనలో లోపాలు ఉండొచ్చు.. కానీ దేశానికి కాదన్నారు. కాబట్టే తనకంటే దేశ ప్రజల్ని, వారి బలాన్ని, వారి సామార్థ్యాలను నమ్ముతున్నట్లు తెలిపారు. దేశం స్వావలంబన దిశగా పయనిస్తుందని, ఆర్థిక పునరుజ్జీవనంలో భారతదేశం ఒక ఉదాహరణగా నిలుస్తుందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 


logo