బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 20, 2020 , 02:03:33

ఎల్లుండి జనతా కర్ఫ్యూ

ఎల్లుండి  జనతా కర్ఫ్యూ

  • ఆదివారం ఉదయం  7 గంటల నుంచి  
  • రాత్రి 9 వరకు బయటకు రావద్దు
  • దేశ ప్రజలంతా ఇండ్లకే పరిమితం కావాలి 
  • ‘మనకేం కాదులే’ అనే నిర్లక్ష్య ధోరణి తగదు 
  • సంకల్పం, నిగ్రహంతోనే కరోనా వైరస్‌ నియంత్రణ
  • అత్యవసరమైతే తప్ప కొన్నివారాలు గడపదాటొద్దు
  • జాతిని ఉద్దేశించి  ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం

న్యూఢిల్లీ, మార్చి 19 : కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ‘సంకల్పం, నిగ్రహం’ అవసరమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. వచ్చే ఆదివారం దేశవ్యాప్తంగా ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పేరుతో ‘స్వీయ నిర్బంధం’ విధించుకోవాలని కోరారు. ఆరోజు అందరూ ఇండ్లకే పరిమితం కావాలని పిలుపునిచ్చారు. మోదీ గురువారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. ఈ నెల 22 ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలంతా ఇండ్లకే పరిమితం కావాలని కోరారు. అత్యవసర సేవల సిబ్బందికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారతీయులు సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకొనేందుకు ఇదో పరీక్ష (లిట్మస్‌ టెస్ట్‌) అని చెప్పారు. 

ఈ అనుభవం దేశానికి ఎంతో మేలుచేస్తుందన్నారు. ప్రపంచం ఇంతకుముందెన్నడూ ఎరుగని విపత్తును కరోనా రూపంలో ఎదుర్కొంటున్నదని చెప్పారు. మొదటి, రెండో ప్రపంచయుద్ధాల కన్నా ఎక్కువ దేశాలు ఈ వైరస్‌ కారణంగా తల్లడిల్లుతున్నాయని పేర్కొన్నారు. కఠిన నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలను బయట తిరగకుండా కట్టడి చేయడం ద్వారా కొన్ని దేశాలు ఈ వైరస్‌ వ్యాప్తిని నియంత్రించగలిగాయని పేర్కొన్నారు. భారత్‌ ఈ విపత్తును ముందుగానే గ్రహించి తగిన జాగ్రత్తలు తీసుకున్నదని చెప్పారు. ప్రభుత్వాలు ఇస్తున్న సలహాలు, సూచనలను పాటించాలన్నారు.

నిర్లక్ష్యం.. భయం వద్దు 

‘కరోనా వైరస్‌ మనల్ని ఏం చేయలేదులే..!’ అన్న నిర్లక్ష్య భావనను విడిచిపెట్టాలని మోదీ కోరారు. అభివృద్ధి చెందిన దేశాలు సైతం వైరస్‌తో అవస్థలు పడుతున్న విషయాన్ని గుర్తుచేశారు. వైరస్‌ను అడ్డుకునే ఔషధాన్ని ఇప్పటివరకు కనుగొనలేదని చెప్పారు. ప్రతి భారతీయుడు ఈ వ్యాధి పట్ల అవగాహన పెంచుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేసమయంలో కరోనా భయంతో ప్రజలు నిత్యావసరాలు, ఇతర సరుకులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి ఇండ్లల్లో దాచుకోవద్దని విన్నవించారు. ముఖ్యంగా ఔషధాలను నిల్వ చేసుకొని కోరారు.  ప్రజలకు సరిపడా సరుకులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. 

గడప దాటొద్దు 

వైరస్‌ను నియంత్రించేందుకు మరికొన్ని వారాలు ఓపిక పట్టాలని ప్రధాని కోరారు. ఈ క్రమంలో ప్రజలు ‘సంకల్పం, నిగ్రహం’ అనే సూత్రాలను పాటించాలని కోరారు. ‘ప్రజలంతా మరికొన్ని వారాలపాటు అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటికి రావొద్దు. ఇంటి నుంచే పనిచేసే విధానాన్ని (వర్క్‌ ఫ్రం హోం) పాటించాలి’ అని సూచించారు. 

వారందరికీ సలాం 

మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్య, పారిశుద్ధ్య, విమానయాన, మీడియా సిబ్బంది తదితరులు ఎంతో కృషి చేస్తున్నారని మోదీ కొనియాడారు. ప్రజలంతా వారికి సంఘీభావం ప్రకటించాలని కోరారు. ఆదివారం సాయం త్రం ఐదు గంటలకు ప్రజలంతా నిలబడి ఐదు నిమిషాల పాటు కరతాళ ధ్వనులు, ప్లేట్లను కొట్టడం, గంటలు మోగించడం ద్వారా వారికి కృతజ్ఞతలు తెలుపాలని పిలుపునిచ్చారు. 


logo