సోమవారం 18 జనవరి 2021
National - Dec 25, 2020 , 11:13:08

అటల్‌ బిహారి వాజ్‌పేయికి ఘన నివాళి

అటల్‌ బిహారి వాజ్‌పేయికి ఘన నివాళి

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి 96వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఘన నివాళులర్పించారు. ‘సదైవ్‌ అటల్‌’ స్మారకం వద్ద పూలమాల వేసి, నివాళులర్పించారు. రాష్ట్రపతితో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, పియూష్ గోయల్ సైతం నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ట్విట్టర్‌ ద్వారా వాజ్‌పేయికి ఘన నివాళులర్పించారు. ‘ఆయన నాయకత్వం, దూరదృష్టితో దేశాన్ని అపూర్వమైన అభివృద్ధి వైపు నడపించారని.. బలమైన, సంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఎప్పుడూ గుర్తుండిపోతాయి’ ప్రధాని ట్వీట్‌ చేశారు.


1998-2004 వరకు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వానికి అటల్‌ బిహారి వాజ్‌పేయి నాయకత్వం వహించారు. బీజేపీ నుంచి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తొలి నాయకుడు ఆయనే. వాజ్‌పేయి భారతదేశ ప్రధానమంత్రిగా మూడు పర్యాయాలు పని చేశారు. మొదట 1996లో 13 రోజుల కాలానికి, తర్వాత 1998 - 1999 వరకు 13 నెలల కాలానికి, అనంతరం 1999 -2004 వరకు ప్రధానిగా పని చేశారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఆయన ఒకరూ. 25 డిసెంబర్‌, 1924లో జన్మించిన ఆయన.. 2018 ఆగస్టు 16న మరణించారు. వాజ్‌పేయికి బీజేపీ ప్రభుత్వం 2015లో భారత రత్న పురస్కారంతో సత్కరించింది. అలాగే ఆయన డిట్ అవార్డు, 1994 లో ఉత్తమ పార్లమెంట్‌ సభ్యుడిగా గోవింద్ బల్లభ్ పంత్ అవార్డును అందుకున్నారు.