ఆదివారం 17 జనవరి 2021
National - Dec 05, 2020 , 19:39:24

7న ఆగ్రా మెట్రో పనులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

7న ఆగ్రా మెట్రో పనులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : రూ.8 వేల కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన ఆగ్రా మెట్రో ప్రాజెక్టు నిర్మాణం పనులను ఈ నెల 7 న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. రెండు కారిడార్లతో కూడిన ఆగ్రా మెట్రో ప్రాజెక్టు ప్రధాన పర్యాటక ఆకర్షణలైన తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్, సికంద్ర వంటి ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లకు కలుపుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.8,379.62 కోట్లు. ఈ మెట్రో మార్గంలో ఆపరేషన్లు 2022 డిసెంబర్ నాటికి ప్రారంభమయ్యేలా పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి మోదీతోపాటు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు ఆగ్రాలోని 15 బెటాలియన్ పీఏసీ పరేడ్ మైదానంలో నిర్వహించే ప్రారంభోత్సవం కార్యక్రమానికి హాజరుకానున్నారు.

ఆగ్రా మెట్రో ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత 29.4 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఆగ్రా మెట్రో పర్యాటకానికి ఒక వరంగా ఉంటుందని, మొదటి రైలు తాజ్ మహల్ నుంచి జామా మసీదు వరకు ప్రాధాన్యతా విభాగంలో నడుస్తుందని యూపీ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కుమార్ కేశవ్ తెలిపారు. ఆగ్రా మెట్రో ప్రాజెక్టు మొదటి దశలో ఆరు స్టేషన్లను నిర్మిస్తామని, ఇందులో మూడు ఎలివేటెడ్, మూడు భూగర్భ స్టేషన్లు ఉంటాయని  రైల్వే సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇందుకోసం తాజ్ మహల్ సమీపంలోని పురాణి మండి వద్ద ఎలివేటెడ్ ర్యాంప్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం వినియోగించే 95 శాతం భూమి ప్రజా ఆస్తి అని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం గత నెలలో స్పష్టం చేసింది. అయితే, ప్రైవేటు సంస్థలు, రైల్వేలు, రక్షణ యాజమాన్యంలోని సుమారు 89 హెక్టార్ల భూమిని కూడా దీని కోసం రూ.420 కోట్ల వ్యయంతో కొనుగోలు చేయనున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.