ఆదివారం 05 జూలై 2020
National - Jun 19, 2020 , 13:04:54

మోదీతో అఖిలపక్ష సమావేశానికి 20 పార్టీలకు ఆహ్వానం

మోదీతో అఖిలపక్ష సమావేశానికి 20 పార్టీలకు ఆహ్వానం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి 20 పార్టీలు పాల్గొననున్నాయి. లోక్‌సభలో ఐదుగురికిపైగా ఎంపీలున్న రాజకీయ పార్టీలు, కేంద్ర మంత్రివర్గంలోని పార్టీలతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పార్టీలకు ఆహ్వానం అందినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ తరుఫున కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్వయంగా ఆయా పార్టీల అధినేతలకు గురువారం ఫోన్‌ చేసి అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగనున్న ఈ భేటీలో ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొననున్నారు. 

లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో భారత్‌, చైనా మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. అయితే లఢక్ సరిహద్దులో ఏం జరుగుతున్నదో ప్రధాని మోదీ చెప్పాలంటూ ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రధాని మోదీ బుధవారం చెప్పారు. మరోవైపు ఈ సమావేశానికి తమను ఆహ్వానించకపోవడంపై ఆప్‌, ఆర్జేడీ నేతలు మండిపడ్డారు. ముఖ్యమైన ఇలాంటి సమావేశానికి కేంద్రం తమను పిలువకపోవడాన్ని వారు తప్పుపట్టారు. logo