న్యూఢిల్లీ : గత ఏడాదితో పోలిస్తే ప్రధాని నరేంద్ర మోదీ నికర ఆస్తుల విలువ స్వల్పంగా పెరిగింది. ప్రధాని వెబ్సైట్లో తాజా గణాంకాల ప్రకారం గత ఏడాది రూ 2.85 కోట్లుగా ఉన్న ప్రధాని నికర సంపద రూ 22 లక్షలు ఎగబాకి రూ 3.07 కోట్లకు చేరింది. ప్రధాని తాజా డిక్లరేషన్ ప్రకారం మోదీ బ్యాంక్ బ్యాలెన్స్ మార్చి 31 నాటికి రూ 1.5 లక్షలు, రూ 36,000గా ఉంది. ఇక ఎస్బీఐ గాంధీనగర్ బ్రాంచ్‌లో గత ఏడాది రూ 1.6 కోట్లుగా ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ 1.86 కోట్లకు పెరగడంతో మోదీ సంపద ఆ మేరకు ఎగబాకింది.
డిక్లరేషన్ ప్రకారం ప్రధాని మోదీకి స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, మ్యూచ్‌వల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఎలాంటి సంపద సమకూరలేదు. ఇక మోదీ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లో రూ 8,93,251. ఎల్ఐసీ పాలసీల్లో రూ 1,50,957, ఎల్అండ్టీ ఇన్ఫ్రా బాండ్స్‌లో రూ 20,000 చొప్పున ఇన్వెస్ట్ చేవారు. ప్రధాని మోదీకి రూ 1.48 లక్షల విలువైన నాలుగు గోల్డ్ రింగ్స్ ఉన్నాయి. మోదీకి రూ 1.97 కోట్ల విలువైన చరాస్తులు ఉండగా ఆయన పేరుతో ఎలాంటి వ్యక్తిగత వాహనం లేదు. బ్యాంకులు, ఆర్ధిక సంస్థల నుంచి ఆయన ఎలాంటి రుణం తీసుకోలేదు.
ఇక 2002లో గుజరాత్ సీఎం బాధ్యతలు చేపట్టేందుకు రెండు నెలల ముందు మోదీ గుజరాత్‌లోని గాంధీనగర్, సెక్టార్ 1లో ముగ్గురు సహ యజమానులతో కలిసి 3543 చదరపు అడుగుల ప్లాట్‌ను కొనుగోలు చేశారు. అప్పట్లో దీని ఖరీదు రూ 1.3 లక్షలు కాగా భూమిపై రూ2.4 లక్షలు పెట్టుబడి పెట్టగా ప్రస్తుతం దాని విలు రూ 1.10 కోట్లు పలుకుతోంది. 2014లో ప్రధాని బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ ఎలాంటి ఆస్తులనూ కొనుగోలు చేయలేదు.