బుధవారం 27 జనవరి 2021
National - Jan 04, 2021 , 12:15:55

తొలి టీకా ప్ర‌ధాని వేయించుకోవాలి: ‌కాంగ్రెస్‌

తొలి టీకా ప్ర‌ధాని వేయించుకోవాలి: ‌కాంగ్రెస్‌

ప‌ట్నా: కరోనా మహ్మమ్మారి నిర్మూల‌న కోసం కొవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు అందుబాటులోకి రావ‌డంతో త్వ‌ర‌లో ఆ వ్యాక్సిన్‌ల పంపిణీ మొద‌లు పెట్టేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఈ నేప‌థ్యంలో టీకాకు సంబంధించి రాజ‌కీయ పార్టీల మ‌ధ్య వాద ప్ర‌తివాద‌న‌లు ప్రారంభ‌మ‌య్యాయి. తాజాగా బీహార్‌కు చెందిన కాంగ్రెస్ నేత అజిత్‌ శర్మ వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

కరోనా వ్యాక్సిన్ సుర‌క్షిత‌మా.. క‌దా..? అనే విష‌యంలో తలెత్తుతున్న అనుమానాలపై ప్రశ్న‌లు లేవ‌నెత్తారు. నూతన సంవత్సరం ఆరంభంలోనే వ్యాక్సిన్ రావడం ఆనందదాయకమని, అయితే వ్యాక్సిన్‌ రక్షణపై చాలామందిలో అనుమానాలున్నాయని చెప్పారు. రష్యా, అమెరికా దేశాధినేతలు ఏవిధంగానైతే తమ దేశంలో తొలి వ్యాక్సిన్‌ను తామే వేయించుకున్నారో.. అదేవిధంగా మన దేశంలో  ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అగ్ర నేతలు ముందుగా టీకా వేయించుకోవాలన్నారు. 

ప్ర‌ధాని ముందుగా టీకా వేయించుకుంటే ప్రజలకు దానిపై నమ్మకం కుదురుతుందని అజిత్ శ‌ర్మ పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావ‌డాన్ని బీజేపీ నేత‌లు త‌మ ఘ‌న‌త‌గా చెప్పుకుంటున్నార‌ని, వాస్త‌వానికి సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థ‌లు కాంగ్రెస్ హయాంలోనే  ఏర్పడ్డాయ‌న్న విష‌యాన్ని గుర్తించాలని ఆయ‌న వ్యాఖ్యానించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo