ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 17:06:38

కరోనాపై ప్రధాని సమీక్ష

కరోనాపై ప్రధాని సమీక్ష

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ శనివారం దేశంలో కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌, నీతి ఆయోగ్ సభ్యుడు, కేబినెట్ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు హాజరయ్యారు. కరోనా వైరస్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగేలా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. మహమ్మారిని సమర్థంగా కట్టడి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర, స్థానిక అధికారులను ప్రశంసించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ మహమ్మారి పరిస్థితిపై మోదీ సమీక్షించిన ప్రధాని.. రాష్ట్రాల సన్నద్ధతను తెలుసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగత పరిశుభ్రత, సాంఘిక ప్రవర్తన బాగుండాలని సూచించారు. కరోనాపై అవగాహనను విస్తృతం చేయాలని ఆదేశించారు. ఎవరికీ వైరస్‌ సంక్రమించకుండా కఠిన చర్యలు కొనసాగించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావులేదన్నారు.

అహ్మదాబాద్‌లో విజయవంతమైన 'ధన్వంతరి రథ్‌' కార్యక్రమాన్ని అంతటా అమలు చేస్తే బాగుంటుందని సూచించారు.  అహ్మదాబాద్‌లో ఇంటి వద్దనే బాధితులను పర్యవేక్షించడం, వైద్యం అందించే 'ధన్వంతరి రథ్‌'ను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ దీన్ని అమలు చేయాలని సూచించారు. అత్యధిక పాజిటివ్‌ రేటు నమోదవుతున్న రాష్ట్రాలపై జాతీయ స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు మోదీ ఆదేశించారు. కాగా, కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం శనివారం 27, 114 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం 8లక్షల మార్కును దాటింది. ఇప్పటి వరకు 8,20,916 పాజిటివ్‌ కేసులు నమోదవగా, వీరిలో 2,83,407 మంది చికిత్స పొందుతుండగా, 5,15,387 మంది కోలుకున్నారని తెలిపింది. మరో 22,123 మంతి వైరస్‌ ప్రభావంతో మరణించినట్లు వివరించింది.


logo