గురువారం 02 జూలై 2020
National - Jun 18, 2020 , 02:00:25

అన్‌లాక్‌-2 అమలు ఎలా?

అన్‌లాక్‌-2 అమలు ఎలా?

  • చర్చించాలని సీఎంలకు ప్రధాని మోదీ సూచన
  • దేశంలో మరోమారు లాక్‌డౌన్‌ ఉండదని వెల్లడి
  • కరోనాపై ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం

న్యూఢిల్లీ, జూన్‌ 17: దేశంలో మరోమారు లాక్‌డౌన్‌ ఉండబోదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అన్‌లాక్‌-2 ఎలా అమలు చేయాలన్నదానిపై చర్చించాలని ముఖ్యమంత్రులకు సూచించారు. కరోనా నివారణ చర్యలపై సమీక్షలో భాగంగా ఆయన బుధవారం 14 రాష్ర్టాల సీఎంలు, జమ్మూకశ్మీర్‌ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారన్న వదంతులను తోసిపుచ్చారు. లాక్‌డౌన్‌ నిబంధనల్లో సడలింపుల వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయన్నారు. ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోనే ఉందని తెలిపారు. 

కరోనా వైరస్‌ నివారణలో సమాచారం అత్యంత కీలక అంశమని, కొవిడ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్లు ‘హెల్ప్‌ లెస్‌' నంబర్లుగా మారకూడదని ప్రధాని చెప్పారు. సీనియర్‌ డాక్టర్లు యువ వలంటీర్లతో బృందాలను ఏర్పాటు చేసి టెలిమెడిసన్‌ ద్వారా రోగులకు సూచనలు ఇవ్వాలన్నారు. ప్రజల్లో కొవిడ్‌పై అవగాహన పెంచి వారిలో భయాందోళనలను దూరం చేయాలని సూచించారు. భౌతికదూరం ఉల్లంఘన, పట్టణాల్లో కిక్కిరిసిన ఇండ్లు కొవిడ్‌ నివారణలో మరిన్ని సవాళ్లు విసురుతున్నాయని చెప్పారు. రికవరీ రేటు పెరగడం ఊరటనిస్తున్నదని అన్నారు. అన్ని రాష్ర్టాలు తమ కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వైద్య సదుపాయాలు, మరింత పెంచాలన్నారు. కొన్ని చోట్ల కేసులు బాగా పెరుగుతున్నప్పటికి ప్రజల సంయమనం, అధికారుల ముందుచూపు వల్ల కరోనా నియంత్రణలోనే ఉన్నదని తెలిపారు. 

ఒక్కరోజే మరణాలు   

దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్నది. రికార్డు స్థాయిలో బుధవారం ఒక్కరోజే 2,003 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 11,903కి చేరింది. ఇంతకుముందు నమోదుకాని మరణాలను మహారాష్ట్ర, ఢిల్లీ తాజాగా జతచేయడంతో మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దేశంలో వరుసగా ఆరోరోజూ పదివేలకుపైగా కేసులు నమోదయ్యాయి. బుధవారం 10,974 కేసులు రికార్డు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,54,065కి చేరింది. 2,003 మరణాల్లో ఒక్క మహారాష్ట్రలోనే 1,409 మరణాలు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 1,55,227 మంది చికిత్స పొందుతున్నారు. 1,86,934 మంది ఇప్పటికే కోలుకున్నారు. దీంతో  రికవరీ రేటు 52.79%గా నమోదైంది. మరోవైపు, వైద్యులకు వేతనాలు చెల్లించేలా రాష్ర్టాలకు ఆదేశాలివ్వాలని కేంద్రానికి సుంప్రీకోర్టు ఆదేశించింది.


logo