శుక్రవారం 10 జూలై 2020
National - Jun 17, 2020 , 01:38:42

సహకారానికి సంకేతం!

సహకారానికి సంకేతం!

  • దేశంలోని సమాఖ్య వ్యవస్థ వల్లే కరోనాపై సమర్థ పోరాటం 
  • ఆర్థికవ్యవస్థ కోలుకుంటున్నది..సీఎంలతో సమావేశంలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జూన్‌ 16: లాక్‌డౌన్‌ నుంచి దేశం క్రమంగా నిష్క్రమిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. కరోనా మహమ్మారిపై భారత్‌ సాగిస్తున్న పోరాటం ‘సహకార సమాఖ్య’ విధానానికి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు. దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో బుధవారం 21 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  ఒకవైపు, వైద్య వసతులు, పరీక్షలు మెరుగుపరుస్తూనే, మరోవైపు ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించాలని చెప్పారు. వైరస్‌ ముప్పు ఇంకా తొలిగిపోలేదని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సరైన సమయంలో భారత్‌ చర్యలు తీసుకోవడం వల్లే వైరస్‌ వ్యాప్తిని చాలావరకు అడ్డుకోగలిగామని ప్రధాని పేర్కొన్నారు. 

దేశంలో ప్రాణనష్టం తక్కువే..

‘గత కొన్ని వారాల్లో వేలాది మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. లక్షల మంది వలస కూలీలు స్వస్థలాలకు చేరారు. రోడ్డు, గగనతల, సముద్రమార్గాలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో, దేశ జనాభా ఎక్కువగా ఉన్నా, ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో వైరస్‌ వ్యాప్తి, మరణాల రేటు తక్కువగానే ఉన్నది. దేశంలో రికవరీ రేటు 50 శాతానికిపైగా ఉన్నది. దీనిపై ప్రపంచం చర్చించుకుంటున్నది’ అని చెప్పారు.  

మాస్క్‌ లేకుండా బయటకు వెళ్లొద్దు..

‘గత కొన్ని వారాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. విద్యుత్‌ వినియోగం పెరిగింది. ద్విచక్ర వాహనాల డిమాండ్‌, ఉత్పత్తి.. లాక్‌డౌన్‌కు ముందున్న స్థాయిలో 70 శాతానికి చేరుకున్నాయి. అలాగే వానకాల పంటల సాగు 12-13 శాతం పెరిగింది’ అని ప్రధాని వివరించారు.  మాస్క్‌ ధరించకుండా బయటకు వెళ్లడాన్ని ఊహించలేమని, ప్రజలు తప్పనిసరిగా నిర్ణీత దూరం పాటించాలని సూచించారు.  


logo