శుక్రవారం 10 జూలై 2020
National - Feb 17, 2020 , 02:57:44

వెనక్కి తగ్గం

వెనక్కి తగ్గం
  • ఆర్టికల్‌ 370 రద్దు, సీఏఏపై స్పష్టత ఇచ్చిన ప్రధాని
  • ఒత్తిడి ఉన్నా, నిర్ణయాలను సమీక్షించబోమన్న మోదీ

వారణాసి, ఫిబ్రవరి 16: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుపై వెనక్కితగ్గే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంపై వివిధ వర్గాల నుంచి ఒత్తిడి ఉన్నదని, అయినా ఈ రెండు నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టులో ఆర్టికల్‌ 370ని రద్దు చేసింది. ఇటీవల తీసుకొచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తన సొంత నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని మోదీ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ.. దేశ ప్రయోజనాల కోసమే సీఏఏ, ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయాలను తీసుకున్నట్టు చెప్పారు. వాటిపై పునరాలోచించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరుతో ట్రస్ట్‌ ఏర్పాటుచేశామని చెప్పారు. ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనులు వేగంగా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో ట్రస్ట్‌కు 67 ఎకరాల భూమిని అప్పగిస్తామన్నారు. స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించాలని విన్నవించారు. 

 

దీన్‌దయాళ్‌ ప్రేరణతో.. 

పర్యటనలో భాగంగా ఆరెస్సెస్‌ సిద్ధాంతకర్త పండిట్‌ దీనదయాల్‌ ఉపాధ్యాయ 63 అడుగుల విగ్రహాన్ని మోదీ ప్రారంభించారు. ఇది దేశంలోనే ఎత్తయిన దీనదయాల్‌ విగ్రహంగా రికార్డు నెలకొల్పనున్నది. ఆయన పేరుతో ఏర్పాటుచేసిన స్మారక కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. ‘రోడ్‌ వే, హైవే, వాటర్‌ వే, రైల్వే’ తమ ప్రభుత్వ ప్రాధాన్య అంశాలని చెప్పారు. ‘శ్రీ జగద్గురు విశ్వారాధ్య గురుకుల్‌' శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలోనూ మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘శ్రీ సిద్ధాంత శిఖామణి గ్రంథం’ 19 భాషల అనువాదాన్ని, మొబైల్‌ యాప్‌ను ప్రారంభించారు. కొత్త దశాబ్దం మొదలవుతున్న సందర్భంలోనే శతాబ్ది ఉత్సవాలు జరుగడం యాధృచ్ఛికమన్నారు. 19 భాషల్లోకి అనువదించడం ద్వారా ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. అంతకుముందు ప్రధాని తన నియోజకవర్గంలో రూ.1,254 కోట్లతో చేపట్టనున్న 50 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో నడిచే ‘మహా కాల్‌ ఎక్స్‌ప్రెస్‌'ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. 


logo