శనివారం 05 డిసెంబర్ 2020
National - Sep 02, 2020 , 18:10:18

యూఎన్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో సెప్టెంబ‌ర్ 26న ప్ర‌ధాని ప్ర‌సంగం

యూఎన్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో సెప్టెంబ‌ర్ 26న ప్ర‌ధాని ప్ర‌సంగం

న్యూఢిల్లీ: ఐక్య‌రాజ్య‌స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీ వార్షిక స‌మావేశాలు ఈ ఏడాది వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో జ‌రుగ‌నున్నాయి. క‌రోనా మ‌హమ్మారి నేప‌థ్యంలో వివిధ దేశాల అధినేత‌లు నేరుగా హాజ‌రుకాకుండానే స‌మావేశాలు కొన‌సాగ‌నున్నాయి. సెప్టెంబ‌ర్ 21న‌ స‌మావేశాలు ప్రారంభం కానుండ‌గా.. సెప్టెంబ‌ర్ 22 నుంచి 29 వ‌ర‌కు వివిధ దేశాల అధినేత‌లు త‌మ ప్ర‌సంగాల‌ను వినిపించ‌నున్నారు. అయితే వారు నేరుగా స‌మావేశాల‌కు హాజ‌రుకావ‌డంలేదు కాబ‌ట్టి ముందుగానే స్టేట్‌మెంట్‌ల‌ను వీడియో రికార్డు చేసి ఐక్య‌రాజ్య‌స‌మితికి పంప‌నున్నారు.

గ‌త 75 సంవ‌త్స‌రాల ఐక్య‌రాజ్య‌స‌మితి చ‌రిత్ర‌లో సాధార‌ణ స‌భ వార్షిక స‌మావేశాల‌ను వ‌ర్చువ‌ల్ విధానంలో నిర్వ‌హిస్తుండ‌టం ఇదే మొద‌టిసారి. కాగా, ఈ సమావేశాల నిర్వ‌హ‌ణ‌లో భాగంగా జ‌రిగే దేశాధినేత‌ల చ‌ర్చ‌కు సంబంధించి ఐక్యరాజ్య‌స‌మితిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీ అండ్ కాన్ఫ‌రెన్స్ మేనేజ్‌మెంట్ స్పీక‌ర్ల జాబితాను వెల్ల‌డించింది. ఆ జాబితా ప్ర‌కారం భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌సంగాన్ని సెప్టెంబ‌ర్ 26న ఉద‌యం వినిపించ‌నున్నారు. అయితే రాబోయే కొన్ని వారాల్లో స్పీక‌ర్‌ల క్ర‌మం ప‌ద్ధ‌తికి సంబంధించి కొన్ని మార్పులు చోటుచేసుకునే అవ‌కాశం ఉన్న‌ది. 

ఈ ఏడాది జ‌రుగ‌నున్న ఐక్య‌రాజ్య‌స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీ వార్షిక సమావేశాల్లో బ్రెజిల్ అధ్య‌క్షుడు జైర్ బోల్సోనారో ముందుగా ప్ర‌సంగించ‌నున్నారు. అనంత‌రం అమెరికా ప్ర‌తినిధి ప్ర‌సంగించ‌నున్నారు. మొత్తానికి మొద‌టిరోజు ట‌ర్కీ అధ్య‌క్షుడు రిసెప్ త‌య్యిప్ ఎర్డోగ‌న్‌, చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌, ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌, ఇరాన్ అధ్య‌క్షుడు హ‌స‌న్ రౌహానీ, ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్‌ త‌మ ప్ర‌సంగాల‌ను వినిపించ‌నున్నారు.  అయితే ప్ర‌సంగాల‌ను రికార్డు చేసి పంపే స్పీక‌ర్లు ఎవ‌రికి వారు స్వ‌చ్ఛందంగా 15 నిమిషాల ప‌రిమితి మించ‌కుండా చూసుకోవాల‌ని ది డిపార్ట్‌మెంట్ ఫ‌ర్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీ అండ్ మేనేజ్‌మెంట్ కోరింది.             

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.