ఆదివారం 17 జనవరి 2021
National - Jan 01, 2021 , 13:25:26

ఆరు న‌గ‌రాల్లో ఇండ్ల నిర్మాణం.. లైట్‌హౌజ్ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాప‌న‌

ఆరు న‌గ‌రాల్లో ఇండ్ల నిర్మాణం.. లైట్‌హౌజ్ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాప‌న‌

న్యూఢిల్లీ: గ‌్లోబ‌ల్ హౌజింగ్ టెక్నాల‌జీ ఛాలెంజ్ ఇండియా కింద ఏర్పాటు చేస్తున్న లైట్ హౌజ్ ప్రాజెక్స్‌(ఎల్‌హెచ్‌పీ)కు ప్ర‌ధాని మోదీ ఇవాళ శంకుస్థాప‌న చేశారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఎల్‌హెచ్‌పీ ప్రాజెక్టు కింద ఇండోర్‌, రాజ్‌కోట్‌, చెన్నై, రాంచీ, అగ‌ర్త‌లా, ల‌క్నో న‌గ‌రాల్లో ఒక్కొక్క చోట వెయ్య ఇండ్ల‌ను నిర్మించ‌నున్నారు.  అన్ని మౌళిక స‌దుపాయాల‌తో ఆ ఇంట్ల నిర్మాణం జ‌ర‌గ‌నున్న‌ది.  వ‌ర్చువ‌ల్ జ‌రిగిన శంకుస్థాన కార్య‌క్ర‌మంలో యూపీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, త్రిపుర‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రులు పాల్గొన్నారు. ఉత్త‌మ సాంకేతిక నిపుణ‌తో ప్ర‌జా సంక్షేమం కోసం ఇండ్ల నిర్మాణం ఆ ప్రాజెక్టు కింద చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించారు.  అభివృద్ధి సూచీని అగ్ర‌స్థానంలో నిలిపేందుకు ఆధునాత‌న టెక్నాల‌జీతో నిర్మాణం చేప‌ట్ట‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని ప్ర‌ధాని అన్నారు.  

6 లైట్‌హౌజ్ ప్రాజెక్టులు..

ఆరు లైట్ హౌజ్ ప్రాజెక్టుల‌తో దేశ గృహ నిర్మాణ రంగంలో కొత్త ద‌శ ప్రారంభం అవుతుంద‌ని మోదీ అన్నారు. ఓ ద‌శ‌లో కేంద్ర ప్ర‌భుత్వాలు హౌజింగ్ స్కీమ్‌ల‌ను ప‌ట్టించుకోలేద‌న్నారు. స‌మ‌గ్ర అభివృద్ధి లేకుండా మార్పు సాధ్యం కాద‌న్నారు.  కొత్త పంథాను, కొత్త విధానాల‌ను త‌మ ప్ర‌భుత్వం అవ‌లంబిస్తోంద‌న్నారు.  కోవిడ్‌19 స‌వాళ్ల‌తో కొత్త టెక్నాల‌జీ, ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ద‌గ్గ‌ర కావాల్సి వ‌చ్చింద‌ని, ఈ నేప‌థ్యంలో నేటి నుంచి ఆరు లైట్ హౌజ్ ప్రాజెక్టుల‌ను చేప‌డుతున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. ఆధునిక టెక్నాల‌జీ, ఇన్నోవేటివ్ విధానంలో ఆ ప్రాజెక్టుల‌ను చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. చాలా త‌క్కువ స‌మ‌యంలో.. ఎక్కువ సౌల‌భ్యం ఉండే ఇండ్ల‌ను నిర్మించ‌నున్న‌ట్లు మోదీ చెప్పారు.  

3డీ టెక్నాల‌జీ..

జ‌ర్మ‌నీకి చెందిన 3డీ నిర్మాణ టెక్నాల‌జీతో రాంచీలో ఇళ్లు నిర్మించ‌నున్న‌ట్లు మోదీ తెలిపారు. ఈ విధానంలో ప్ర‌తి రూమ్‌ను స‌ప‌రేట్‌గా నిర్మిస్తార‌న్నారు.  అయితే మొత్తం నిర్మాణాన్ని లీగో బ్లాక్‌ల‌తో క‌నెక్ట్ చేస్తార‌‌న్నారు. అగ‌ర్త‌లాలో స్టీల్ ఫ్రేమ్ టెక్నాల‌జీతో ఇండ్లు నిర్మిస్తున్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు.  ఇది న్యూజిలాండ్ టెక్నాల‌జీ అన్నారు. భూకంపాల నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు ఈ టెక్నాల‌జీ వాడుతున్న‌ట్లు తెలిపారు. ల‌క్నో న‌గ‌రంలో నిర్మించే ఇండ్ల‌కు కెన‌డా టెక్నాల‌జీ వాడ‌నున్నారు.   ప్లాస్ట‌ర్‌, పేయింట్ లేకుండానే.. ప్రీ బిల్ట్ వాల్స్‌ను నిర్మాణం కోసం వినియోగిస్తారు. లైట్ హౌజ్ ప్రాజెక్టు కింద చేప‌ట్టే నిర్మాణాలు అన్నీ.. మ‌న ప్లాన‌ర్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు, విద్యార్థుల‌కు ఇంక్యుబేష‌న్ సెంట‌ర్లుగా మారుతాయ‌న్నారు.  ఈ కొత్త టెక్నాల‌జీల‌ను వారు ప్ర‌యోగాత్మ‌కంగా వినియోగిస్తార‌న్నారు.  

రీస‌ర్చ్ ప్ర‌మోష‌న్‌..

గృహ నిర్మాణ రంగంలో ప‌రిశోధ‌న‌, ఇన్నోవేష‌న్‌ను ప్ర‌మోట్ చేసేందుకు ఏఎస్‌హెచ్ఏ ఇండియా ప్రాజెక్టును చేప‌ట్టిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు.  21వ శ‌తాబ్ధానికి త‌గిన‌ట్లు ఈ ప్రాజెక్టు కింద అత్యాధునిక‌, విలువై టెక్నాల‌జీతో ఇండ్లు నిర్మిస్తున్న‌ట్లు చెప్పారు.  ఆవాస్ యోజ‌న ప‌థ‌కం కింద ల‌క్ష‌ల సంఖ్య‌లో ఇండ్లు నిర్మించార‌ని,  పేద‌వాడైన మ‌ధ్య‌త‌ర‌గ‌తివారైనా.. ఇళ్లు క‌ట్ట‌డ‌మే పెద్ద క‌ల అని, కానీ ఆ క‌ల‌ను ప్ర‌జ‌లు కోల్పోతున్నార‌న్నారు.  పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు త‌గిన‌ట్లు లైట్‌హౌజ్ ప్రాజెక్టు చేప‌ట్టిన‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు.  క‌రోనా వేళ గృహ రుణాలు తీసుకున్న‌వారికి రిబేట్ క‌ల్పించిన‌ట్లు మోదీ చెప్పారు.